You are here

10th Class Exam Papers will be Valuated from Today Under CC Cameras

10th Class Exam Papers will be Valuated from Today Under CC Cameras

 

 

 

 

 

 

 

 

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్‌) ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 27 వరకు 14 రోజుల పాటు ఈ ప్రక్రియ జరగనుంది. ఇందుకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌ వద్దగల పీఆర్‌ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలను స్పాట్‌ కేంద్రంగా నిర్ణయించారు. జిల్లా విద్యాశాఖ, పరీక్షల విభాగం పర్యవేక్షణలో ఇక్కడ మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 5,44,607 జవాబు పత్రాలు వచ్చాయి. వీటిని పాఠశాల ఆవరణలోనే స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ పత్రాల మూల్యాంకనకు 1,700 మంది వరకూ ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించారు. మరో 100 మంది పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బందిని నియమించారు.

 

సీసీ కెమెరాల పర్యవేక్షణలో...

ఒక్కో ఉపాధ్యాయుడికి రోజుకు 40 జవాబు పత్రాలను అందజేస్తారు. ఉదయం పూట 20, మధ్యాహ్నం నుంచి మిగతా 20 చొప్పున జవాబు పత్రాలను అందిస్తారు. పూర్తి సీసీ కెమెరాల నిఘాలో ఈ మూల్యాంకనం జరగనుంది. ఇందుకు నియమించిన ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుంది. ఉదయం 8.30 గంటల కల్లా ఉపాధ్యాయులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. 9 గంటలు దాటితే గేట్లు మూసేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల తరువాత తెరుస్తారు. మూల్యాంకన విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. ప్రతి గదిలోను లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినేందుకు భోజనశాల వసతిని కూడా కల్పించారు. లోపల క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. విద్యుతు సరఫరాలో అంతరాయం కలిగితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్‌ అందుబాటులో ఉంచారు. వాస్తవానికి ఈ మూల్యాంకన ఈనెల 3 నుంచే జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా వాయిదా పడింది. స్పాట్‌ కేంద్రంలో ఏర్పాట్లను ఆదివారం ఆర్జేడీ, రాష్ట్ర పరిశీలకుడు దేవానందరెడ్డి, డీఈవో ఎస్‌.అబ్రహం, పరీక్షల సహాయ కమిషనర్‌ గంటి నాగేశ్వరరావు పరిశీలించారు.

Advertisement

Share this content.