• సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈనెల 23న మూడంచెల భద్రత నడుమ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు.జిల్లాకు సంబంధించి కాకినాడలో మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అధికారులతో కలిసి జేఎన్‌టీయూకే, రంగరాయ వైద్య కళాశాల, ఐడియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, జిల్లా క్రీడా ప్రాంగణం, నన్నయ్య విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన బార్‌కోడింగ్, మెస్‌ల ఏర్పాటును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ హాళ్లకు చేరుకునే సిబ్బంది, ఏజెంట్లకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలాలను కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈనెల 23న కాకినాడలో ట్రాఫిక్‌ ప్లాన్‌ అమలు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల్లో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తి భద్రత నడుమ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నిషాంత్‌కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్వో గోవిందరాజులు, డీఎస్పీలు రవివర్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఏర్పాట్లపై దూరదృశ్య సమావేశం

    కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు బుధవారం జిల్లా అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జేసీ మల్లికార్జున, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్‌ కలెక్టర్లు సాయికాంత్‌వర్మ, వినోద్‌కుమార్, జేసీ-2 సీహెచ్‌.సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు హాజరయ్యారు.