• ఇన్నాళ్లూ ఊరించిన మంత్రి పదవులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.. వైకాపా ప్రభుత్వంలో ఏర్పాటుకానున్న కొత్త మంత్రివర్గంలో జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు నేతలను అమాత్య పదవి వరించింది. అమలాపురం ఎమ్మెల్యే విజేత పినిపే విశ్వరూప్‌, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే విజేత కురసాల కన్నబాబు, మండపేట నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లకు మంత్రి పదవులు దక్కాయి. జిల్లాకు రెండు మంత్రి పదవులే దక్కుతాయని ..మిగతా 7లోఅంతా భావించినా అనూహ్యంగా ముగ్గురికి చోటు లభించడంతో ఆయా వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. శనివారం ఉదయం రాజధానిలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్‌ జట్టులో జిల్లా నుంచి ఓసీ, బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పించినట్లయింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 14 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. తదనుగుణంగానే మంత్రివర్గంలో జిల్లాకు పెద్దపీట దక్కింది. పార్టీ పట్ల విధేయత, కష్టపడేతత్వం..అనుభవం..సామాజిక కోణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆయా నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

   

  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

  ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తాజా ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈయన స్వగ్రామం రామచంద్రపురం మండలం హసన్‌బాద. బీఎస్సీ చదివిన ఈయన 1978లో జిల్లా పరిషత్తు కోఆప్షన్‌ సభ్యునిగా తొలి రాజకీయ పదవిని చేపట్టారు. 1983లో హసన్‌బాద సర్పంచిగా ఎన్నికయ్యారు. 1985, 1994, 1999లలో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1989, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2006 నుంచి 2009 వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించి 2009 నుంచి 2010 వరకు మంత్రిగా కొనసాగారు. 2012లో రామచంద్రపురం నుంచి ఉప ఎన్నికల్లో వైకాపా తరపున పోటీచేసి ఓటమి చవిచూశారు. 2014లో వైకాపా తరపున రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. వైఎస్‌ కుటుంబానికి విధేయుడుగా ఉండడంతో వైకాపా నుంచి పోటీచేసిన మూడోసారీ ఓటమి పాలైనా ఓసారి ఎమ్మెల్సీగా..ఇప్పుడు మంత్రిగా అవకాశం కల్పించి ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు గుర్తింపు ఇచ్చారు.

   

  కురసాల కన్నబాబు

  కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే విజేత కురసాల కన్నబాబు బీకాం, ఎంఏ చదివారు.ఈయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ. పాత్రికేయుడిగా పనిచేసిన అనంతరం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో సినీనటుడు చిరంజీవి కోరిక మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కాంగ్రెస్‌ శాసనసభ్యుడుగా కొనసాగారు. 2014లో కాకినాడ గ్రామీణం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైకాపాలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జగన్‌ జట్టుతో కన్నబాబుకు అవకాశం దక్కింది. కన్నబాబుకు మంత్రి పదవి దక్కడంతో ఓసీలకు జిల్లా నుంచి ప్రాధాన్యం ఇచ్చినట్లయింది.

   

  పినిపే విశ్వరూప్‌

  అమలాపురం ఎమ్మెల్యే విజేత పినిపే విశ్వరూప్‌ బీఎస్సీ, బీఈడీ వరకు చదివారు. 1987లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికలు, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిని చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యేగా.. 2009లో అమలాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2010 వరకు రాష్ట్ర గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా.. 2010 నుంచి 2013 వరకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ, వెటర్నరీ విశ్వవిద్యాలయ, మత్స్య శాఖ మంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిలపై అభిమానంతో ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైకాపా అభివృద్ధికి కృషిచేసి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే విజేతగా నిలిచారు. పార్టీపై వైఎస్‌ కుటుంబంపై విధేయతను గుర్తించిన వై.ఎస్‌.జగన్‌ మరోసారి మంత్రిగా పనిచేసే అవకాశాన్ని విశ్వరూప్‌కు కల్పించారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించినట్లయింది.