• ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కాకినాడ అర్బన్‌ మండలంలో 13, కాకినాడ గ్రామీణ మండలంలో మూడు, సామర్లకోట మండలంలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 7,223 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 4,279 మంది హాజరవగా 2,944 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 59.24 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారని నిర్వాహకులు తెలిపారు. పరీక్షల జిల్లా సమన్వయ అధికారిగా డీఆర్వో ఎంవీ గోవిందరాజులు వ్యవహరించారు. లైజన్‌ అధికారులు, సహాయ లైజన్‌ అధికారులు పరీక్షలను పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం ఆయా ఉప ఖజానా కార్యాలయాల నుంచి పరీక్ష పత్రాలను పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక భద్రత నడుమ తరలించారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను ప్రత్యేక భద్రత నడుమ కలెక్టరేట్‌కు తీసుకువచ్చి ప్రత్యేక వాహనంలో ఏపీపీఎస్సీ అధికారులతో విజయవాడ పంపించారు.