• కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ కష్టాలను అర్జీల రూపంలో అందజేశారు. కాకినాడలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 400 మంది తమ సమస్యలను విన్నవించి రశీదులు తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌.సత్తిబాబు, డీఆర్వో గోవిందరాజులు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్బలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ అందుకున్న అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపారు. వీటి పరిష్కారంపై సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, భూ సమస్యలు పరిష్కరించాలన్న వినతులు అధికంగా వచ్చాయి. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పేదలు ఆర్థిక సహాయం చేయాలన్న అర్జీలపై స్పందించిన కలెక్టర్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పది మందికి రూ.60,000 చొప్పున ప్రజావాణిలో అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా చర్మకారులకు మంజూరైన రుణాలను అయిదుగురు లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున కలెక్టర్‌ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. 

     


    * ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 నుంచి రూ.10,000 పారితోషకాన్ని పెంచడంతో వారంతా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించని బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.


    * అయినవిల్లి మండలం, వీరవల్లిపాలేనికి చెందిన రెడ్డి రంగనాయకులు తన కుమారుడు వీరవెంకట సత్యనారాయణకు వైద్య సదుపాయం కోసం ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను కోరారు. తన కుమారుడికి విశాఖపట్నంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ఆరోగ్య సేవా పథకం కింద జరిగిందని, అనంతరం వైద్య సదుపాయం కోసం సాయం అందించాలని కోరారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నుంచి అవసరమైన మందులను సమకూర్చాలని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్‌ వరప్రసాద్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.


    * జాతీయ స్థాయిలో ఇంధన పొదుపు విభాగంలో బహుమతి సాధించిన పి.గన్నవరం మండలం, కె.ఏనుగులపల్లిలోని జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అడబాల మహి కలెక్టర్‌ను కలిసి మొక్క అందజేశారు. తమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయాలని, మొక్కలు పెంపకానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రతి పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటించాలని, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని డీఈవో అబ్రహంను ఆయన ఆదేశించారు.