• పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించడానికి సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కార్తికేయ మిశ్రా వెల్లడించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌ ఏర్పాట్లను వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాకినాడలోని జేఎన్‌టీయూ, రంగరాయ వైద్య కళాశాల, ఐడియల్‌ కళాశాల, నన్నయ్య వర్సిటీ పీజీ సెంటర్‌, జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాళ్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 7.30 గంటలకు ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారులు, అభ్యర్థులు నియమించుకున్న ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూముల నుంచి కంట్రోల్‌ యూనిట్లు కౌంటింగ్‌ హాళ్లలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపడతారన్నారు. రిటర్నింగ్‌ అధికారుల టేబుళ్ల వద్ద వీటిని లెక్కిస్తారని చెప్పారు. అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 21,727 పోస్టల్‌ బ్యాలెట్లు, పార్లమెంట్‌ నియోజక వర్గాలకు సంబంధించి 19,418 పోస్టల్‌ బ్యాలెట్లు ఇప్పటి వరకూ అందాయని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అనంతరం కంట్రోల్‌ యూనిట్‌(ఈవీఎం)లో ఓట్లను రౌండుల వారీగా లెక్కిస్తారని తెలిపారు. దీని కోసం అవసరమైన టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

   

  21న రెండో విడత ర్యాండమైజేషన్‌

  ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 5,098 మంది సిబ్బందిని నియమించామని, ఈనెల 16న తొలివిడత ర్యాండమైజేషన్‌ చేపట్టామని కలెక్టర్‌ చెప్పారు. ఈనెల 21న ఓట్ల లెక్కింపు సిబ్బంది, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్‌ చేపట్టి, ఎవరు ఏ నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారో నిర్ణయిస్తామన్నారు. ఈనెల 23న ఉదయం 5 గంటలకు మూడో విడత ర్యాండమైజేషన్‌ చేపడతామన్నారు. ఎవరు ఏ టేబుల్‌ వద్ద విధులు నిర్వహిస్తారో అప్పుడే నిర్ణయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈనెల 19న కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

   

  ర్యాలీలకు అనుమతి లేదు

  ఈనెల 27వ తేదీ వరకూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఓట్ల లెక్కింపు అనంతరం ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని కలెక్టర్‌ తెలిపారు. కాకినాడలోని కౌంటింగ్‌ కేంద్రాల సమీపంలో, నగరంలో ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు.

  జేఎన్‌టీయూకే గ్రంథాలయం వద్ద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గం లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాట్లు

  సాయంత్రానికి ఫలితాల వెల్లడి

  పోస్టల్‌ బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్‌లోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత వీవీ పాట్స్‌లోని స్లిప్‌లను లెక్కిస్తామన్నారు. ఈనెల 23న మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కంట్రోల్‌ యూనిట్‌లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. రౌండుల వారీగా వివరాలను సువిధ యాప్‌లో నమోదు చేసి, ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని చెప్పారు. అక్కడి నుంచి వీవీ పాట్స్‌లోని స్లిప్‌ల లెక్కింపునకు అనుమతి రాగానే ప్రక్రియ చేపడతామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి అయిదు వీవీ పాట్స్‌ను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారని తెలిపారు. ఒక వీవీ పాట్‌లోని స్లిప్పులను లెక్కించిన తరువాత మరొకటి లెక్కిస్తారన్నారు. దీంతో ఫలితాలు సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉందన్నారు.

   

  పటిష్టమైన భద్రత

  కౌంటింగ్‌ కేంద్రాల వెలుపల, లోపల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. 911 మంది పోలీసు సిబ్బందిని దీని కోసం నియమించినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు, సిబ్బంది, అభ్యర్థుల వాహనాలను పరిమితి స్థాయిలోనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. మీడియా, కౌంటింగ్‌ ఏజెంట్లకు పాస్‌లు జారీ చేశామని, వీటిని చూపితేనే అనుమతిస్తారని చెప్పారు.