• ‘సొంతింటికి వచ్చినట్లుంది.. తూర్పుగోదావరి పెద్ద జిల్లా.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. జిల్లాలో 2016 నుంచి 2018 వరకు పనిచేశా..ప్రభుత్వం ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి ప్రజలకు సేవలందిస్తా’ అని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి తెలిపారు. జిల్లా ఎస్పీగా బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓ వైపు కోనసీమ, మరోవైపు మన్యం ఇలా జిల్లాలో ప్రాంతాల వారీగా పలు రకాల సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. పోలీసు శాఖలో మంచి బృందం ..మిగతా 7లోఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరినీ సమన్వయపరుస్తూ పటిష్ట చర్యలు చేపడతామని వెల్లడించారు. పోలీసు శాఖ ద్వారా జిల్లాలో అవినీతి రహిత పాలన అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఎస్పీ నయీమ్‌ అస్మి తెలిపారు. ప్రజలతో స్నేహభావంతో మెలుగుతామన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంతో పాటు సమస్య ఎప్పుడొచ్చినా పోలీసులను ఆశ్రయించవచ్చని సూచించారు. ప్రజలకు 247 అందుబాటులో ఉంటామంటూ పోలీసులకు ప్రజల మద్దతు కావాలన్నారు. ప్రజలు స్నేహభావంతో మావెంట ఉంటే విధులు, సేవలు సమర్థంగా అందిస్తామని ఎస్పీ వెల్లడించారు.జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు గంజాయి అక్రమ సాగు, రవాణా వ్యవహారాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. గిరిజనులకు ఎలాంటి సమస్యలొచ్చినా పోలీసులు అండగా ఉంటారన్నారు. గంజాయి నియంత్రణలో భాగంగా చెక్‌పోస్టుల ఏర్పాటుతో పాటు ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తామని, ముందస్తు సమాచార వ్యవస్థనూ మెరుగుపరుస్తామని వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాలో..వ్యసనాల్లోనూ యువత, ప్రధానంగా విద్యార్థుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి విషయాలపై కౌన్సిలింగ్‌ నిర్వహించి యువతలో పరివర్తనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల కదలికలపై సంబంధిత విద్యాలయాలతో పాటు పిల్లల తల్లిదండ్రులు సైతం నిఘా ఉంచాలని సూచించారు.

     

    విఘాతం కలిగిస్తే చర్యలు

    జిల్లాలో శాంతిభద్రతల విఘాతానికి ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో నదులు, సముద్రం, బీచ్‌ ఇతర అందమైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకుల భద్రతపైనా దృష్టిసారిస్తామని తెలిపారు. హోంగార్డు నుంచి పోలీసు అధికారి వరకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలన్న ప్రతిపాదన డీజీపీ, ముఖ్యమంత్రి స్థాయిలో పరిశీలనలో ఉందని చెప్పారు. నిర్ణయం వెలువడిన వెంటనే అమలు చేస్తామన్నారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. పోలీసు శాఖలో అందుబాటులో ఉన్న సిబ్బంది వివిధ కోణాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందన్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఎదురవుతున్న అనారోగ్య సమస్యలపైనా దృష్టి నిలుపుతామని తెలిపారు.

    సర్వమత పెద్దల ఆశీర్వాదాలు

    జిల్లా ఎస్పీగా నియమితులైన అద్నాన్‌ నయీమ్‌ అస్మి బుధవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. ఈయనకు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఓఎస్డీ చక్రవర్తి, రంపచోడవరం ఏఎస్‌పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ వి.ఎస్‌.ప్రభాకరరావు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీలు ఎస్‌.మురళీమోహన్‌, ఎ.పల్లపురాజు, కాకినాడ డీఎస్పీ రవివర్మ, పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు, అమలాపురం డీఎస్పీ రమణ, రామచంద్రపురం డీఎస్పీ జె.వి.సంతోష్‌, కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృష్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.