• మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేలా మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా జిల్లా వ్యాప్తంగా రెండు నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి మార్గదర్శనం చేశారు. ఈ ఆర్థిక అక్షరాస్యత శిక్షణ తరగతులతో అనేక అంశాలపై అవగాహన కలిగించుకున్న డ్వాక్వా మహిళలు నిత్య జీవితంలో తమ ఆదాయం-ఖర్చులను బేరీజు వేసుకుంటూ కుటుంబ పోషణ, స్వయం ఉపాధి వైపు దృష్టి సారించారు. జిల్లాలోని నగర, పురపాలికల్లో ఉన్న 1,86,250 మంది పొదుపు సంఘాల మహిళలు ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా నగదు రహిత లావాదేవీలను పెంచడం, ఏటీఎంల వినియోగం, భద్రత, బ్యాంకు లింకేజీ వ్యవహారాలు, రుణాలు, చెల్లింపులు... ఇలా అనేక విషయాలను తెలుసుకున్నారు. ఎవరికి వారు తమ ఆర్థిక స్థోమతను బట్టి చిరు వ్యాపారాలు ప్రారంభించి దశల వారీగా పొదుపును పెంచుకుంటూ ఏవిధంగా ఎదగవచ్చో తెలిపారు. దీంతో అనేక మంది మహిళలు ఇళ్లల్లోనే చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. గత ఆరు నెలల వరకు ఆండ్రాయిడ్‌ ఫోన్లపై ఏమాత్రం అవగాహన లేని మహిళలు సైతం ప్రస్తుతం పలు లావాదేవీలు వీటి ద్వారా చేయగలుగుతున్నారు.

   * నిజ జీవితానికి అన్వయించుకుని ముందుకు

   * ప్రాథమిక ఆర్థిక సిద్ధాంతాలను వివరిస్తూ ఆర్థిక డైరీని పరిచయం చేశారు. దీని ద్వారా రోజువారీ ఆదాయ-వ్యయాలను ఇందులో నమోదు చేసుకుని నెలకు తమ ఇంటి బడ్జెట్‌ ఏవిధంగా ఉందో ప్రతి మహిళా అంచనా వేసుకుని దుబారాను అరికట్టుకుంటున్నారు.

   * ఖర్చులు-పొదుపును అర్థం చేసుకోవడం ద్వారా ఏది అవసరం, ఏది అనవసరం లేదా తక్షణం ఖర్చు చేయాల్సింది కాదని అంచనా వేసుకోగలుగుతున్నారు.

   * రుణాలు పొంది వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆదాయం వృద్ధి చేసే అవసరాలకు మాత్రమే అప్పు చేసే చైతన్యాన్ని మహిళలు నింపుకోగలుగుతున్నారు. అంతేకాకుండా బ్యాంకు, ప్రైవేటు వడ్డీలను బేరీజు వేసుకుని జాగ్రత్త పడుతున్నారు.

   * ప్రాథమిక బ్యాంకింగ్‌ సూత్రాలను తెలుసుకుని బ్యాంకులతో పరిచయం పెంచుకుని లావాదేవీలను సక్రమంగా నిర్వర్తించేలా, మరొకరిపై ఆధారపడని విధంగా అవగాహన కలిగించుకుంటున్నారు.

   * ప్రమాద నిర్వహణపైనా అవగాహన పెంచుకుని బీమా ప్రాధాన్యతను తెలుసుకుని ప్రవర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమాలో ఎన్ని రకాలున్నాయి? ఏది తమకు మంచిదనేది కూడా ఆలోచిస్తున్నారు.

   * పెట్టుబడుల సిద్ధాంతాలను అవగతం చేసుకుని ఏ రకమైన పెట్టుబడితో ఆదాయం త్వరగా ఆర్జించవచ్చునో తెలుసుకోగలిగారు.

   * ఆర్థిక ప్రణాళికతో అనేక విషయాలను తెలుసుకుని ఖర్చులు తగ్గించే అంశాలను తెలుసుకుని తమ రోజువారీ కార్యక్రమాల్లో అమలు చేసుకుంటున్నారు.

   * దీనికితోడు ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయాలను కూడా పూర్తిగా అవగాహన కలిగించుకుని చైతన్యవంతంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

    

   నగదు రహిత లావాదేవీలు పెరిగాయి

   ‘ఆర్థిక అక్షరాస్యత’ శిక్షణ తరగతుల ద్వారా పూర్తి అవగాహన కల్పించుకున్న పొదుపు సంఘాల మహిళలు ఏటీఎం కార్డులు, ఆండ్రాయిడ్‌ ఫోన్లతో వివిధ యాప్‌లను దిగుమతి చేసుకుని సులువుగా నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు. అంతేకాకుండా అవసర, అనవసర ఖర్చులను గుర్తించి పొదుపును కూడా పెంచుకోగలుగుతున్నారు.

   - వై.ఉమామహేశ్వరరావు, పీడీ, మెప్మా.