• సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 23న కాకినాడలోని అయిదు కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలోని మూడు లోక్‌సభ, 19 శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో పాటు మరో మూడు వేల మంది సిబ్బందిని వినియోగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షకులు, సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ అన్ని కోణాల్లో లెక్కింపుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి కాగా రిటర్నింగ్‌ అధికారులకు శుక్రవారం రాజధానిలో తుది దశ శిక్షణ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాల నుంచి 36 మంది పోటీపడగా.. 19 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు తలపడ్డారు. ప్రధాన పార్టీల్లో ఎవరికి వారు ..మిగతా 7లోవిజయంపై ధీమాగా ఉన్నా.. ఓటరు తీర్పు ఏ మలుపు తిప్పుతుందోన్న ఉత్కంఠ మాత్రం అన్ని వర్గాల్లో నెలకొంది. పోలింగ్‌ రోజున చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో అటు యంత్రాంగం.. ఇటు ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు అప్రమత్తమయ్యారు.ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇచ్చి, వారి అనుమానాలు నివృత్తి చేస్తున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో ఆమోదకర, అభ్యంతరకర అంశాలపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? అనే అంశంపై తర్ఫీదు ఇచ్చారు. లెక్కింపు కేంద్రంలో టేబుళ్ల వారీగా కంట్రోల్‌ యూనిట్లలో నమోదైన ఓట్లు లెక్కించడం.. లెక్కించిన ఓట్లు నమోదు చేయడంపైనా అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపులో కంట్రోల్‌ యూనిట్లతో పాటు ఫారం-17ను పరిశీలించడం, కంట్రోల్‌ యూనిట్ల నిర్వహణ, ఓట్ల నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, జేసీ-2 సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్వో గోవిందరాజులు, కాకినాడ ఆర్డీవో రాజకుమారి, పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు, సెట్రాజ్‌ సీఈవో మల్లిబాబు తదితరుల ఆధ్వర్యంలో సాగింది. మరోవైపు తెదేపా, వైకాపా, జనసేన పార్టీల నేతలు ఎవరికి వారుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లను అప్రమత్తం చేస్తున్నారు. ఇతర పార్టీల ఎత్తుగడలు..లెక్కింపు సమయంలో తెరపైకి వచ్చే పేచీలు, లాలూచీ అంశాలపైనా వారికి అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై అవగాహన ఉండి పార్టీ పట్ల విధేయులుగా ఉన్న వారిని ఓట్ల లెక్కింపునకు ఏజెంట్లుగా నియమించేలా ఏర్పాట్లు చేశారు.

    పోస్టల్‌ బ్యాలెట్లు.. వీవీప్యాట్లు..

    సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. చివరన వీవీ ప్యాట్ల సిప్పుల లెక్కింపు జరగనుంది. మధ్యలో జరిగే ఈవీఎం యంత్రాల ఫలితాలతో విజేతలెవరనే అంశంపై స్పష్టత వచ్చినా ఈ రెండు అంశాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నాకే అధికారిక ప్రకటన వెలువడుతుంది. దీంతో ఆయా ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపునకు అవసరమైన

    అరలను అభ్యర్థుల పేర్లు, గుర్తులు అతికించి ఇప్పటికే సిద్ధం చేశారు. వీవీ ప్యాట్ల సిప్పులు లెక్కించేందుకు వీలుగా ప్లాస్టిక్‌ బాక్సులు కూడా సిద్ధమయ్యాయి. . కౌంటింగ్‌ ప్రక్రియ ముగిశాక యంత్రాలకు సీళ్లు వేసి సిప్పులు అతికించేందుకు అవసరమైన సామగ్రిని కూడా సమకూర్చారు. వీటన్నిటినీ నియోజకవర్గ కేంద్రాల నుంచి కాకినాడలోని ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

    పటిష్ట భద్రత నడుమ..

    కాకినాడలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద మూడంచెల భద్రత కల్పిస్తున్నారు లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు, ఆయా పార్టీల శ్రేణుల తాకిడితో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐల స్థాయి అధికారులు, ఇతర పోలీసులను ప్రతి కేంద్రం వద్ద ఉంచాలని నిర్ణయించారు. వీరితో పాటు ప్రత్యేక బలగాల గస్తీ కూడా ఉంటుంది. భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పార్కింగ్‌ ప్రాంతాలను నిర్దేశించి బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద అగ్నిమాపక పరికరాలతో సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ముందు రోజు నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా కేంద్రాల పరిధిలో ఎలాంటి విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్తు శాఖ యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీంతో ఆ చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా నిమగ్నమయ్యారు. అంతర్జాలంతో పాటు ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, హాట్‌లైన్‌, ఫ్యాక్స్‌ యంత్రాలు, కంప్యూటర్లు ఇతర అవసరమైన అన్ని వసతులనూ ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు ప్రాంగణాల్లో ఏర్పాట్లు ఈనెల 18 నాటికి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో కీలక శాఖలు అప్రమత్తమయ్యాయి.