• శ్రీలంక దేశంలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల నేపథ్యంలో జిల్లాలో నిఘాను ముమ్మరం చేసినట్లు ఎస్పీ విశాల్‌గున్ని వెల్లడించారు. తీరప్రాంత రాష్ట్రాల్లో ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబడే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో జిల్లాలోని పారిశ్రామిక సంస్థలు, షాపింగ్‌మాల్స్, ప్రధానమైన వ్యాపార సంస్థలు, హోటళ్లు, మల్టీఫ్లెక్స్‌ల యాజమాన్యాలతో ఆయన గురువారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఓడరేవులు, విదేశీ పర్యాటకులు బసచేసే ప్రాంతాలు, రెస్టారెంట్లు, జన సంచారం ఎక్కువగా ఉండే హోటళ్లు, షాపింగ్‌మాల్స్, చర్చిలు, మసీదులు, హిందూ దేవాలయాల వద్ద డోర్‌ ఫ్రేమ్, హ్యాండ్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీటి వద్ద సీసీ కెమెరాలు నెలకొల్పాలని ఆదేశించారు. ప్రతిచోటా లోపలకు ప్రవేశించే మార్గం, బయటకు వెళ్లే ప్రదేశాల దృశ్యాలను సీసీ కెమెరాల్లో బంధించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సాధారణ కెమెరాల స్థానంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విదేశీయులు ఆయా సంస్థలకు వచ్చినప్పుడు పాస్‌పోర్టు, వీసా నకళ్లు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంస్థలోనూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సెక్యూరిటీ గార్డుల నియామకంలోనూ జాగ్రత్తలు పాటించాలన్నారు. సంస్థలు ఏర్పాటు చేసుకునే ఉద్యోగుల విషయంలో నిఘా ఉంచాలన్నారు. కూలీల రూపంలో ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని, తెలిసిన వారిని మాత్రమే నియమించుకోవాలని సూచించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 94949 33233కు సమాచారం అందించాలని, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యమైన సంస్థలు ఎస్పీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల డేటా నిర్ణీత గడువు ప్రకారం భద్రపర్చాలన్నారు. దేవాలయాల్లో సంబంధిత కార్వనిర్వాహక అధికారులు, ఎస్‌ఐలు సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి సంస్థలోనూ భద్రతా కోణంలో తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వీటిని ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేయాన్నారు. ప్రతి సంస్థ వద్ద పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ(పరిపాలన) ఎస్‌వీ శ్రీధరరావు, శిక్షణ ఐఏఎస్‌ తుహిన్‌సిన్హా, స్పెషల్‌బ్రాంచి డీఎస్పీలు మురళీమోహన్, పల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.