• బాల్యవివాహాలను 2006లో నిషేధిస్తూ కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చారని, అవి చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంక్షేమాధికారి సీహెచ్‌ వెంకట్రావు తెలిపారు. వాటిని జరిపినా, ప్రోత్సహించినా నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కాకినాడ గ్రామీణం రమణయ్యపేటలో గురువారం బోట్‌క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఆడపిల్లలకు చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల వారిలో శారీరక పరిపక్వత పొందక ముందే తల్లులవుతున్నారని చెప్పారు. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. పుట్టిన పిల్లలు కూడా బలహీనంగా ఉండటంతోపాటు వారి ఎదుగుదలలో లోపాలు ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలన్నారు. లేని పక్షంలో వరుడు, అతడి తల్లిదండ్రులు, వివాహానికి హాజరైన వారిపై సైతం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సదస్సులో వాకర్స్‌ సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు, డా.గుబ్బల లక్ష్మణకుమార్‌, రేలంగి బాపిరాజు, కృష్ణమోహన్‌; గ్రామస్థులు పాల్గొన్నారు.