• కాకినాడలో కాకినాడ- సామర్లకోట రైల్వే లైన్లు కొండయ్యపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేసి ఆర్.ఓ.బి.ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు. మంగళవారంనాడు కాకినాడ కొండయ్యపాలెం వద్ద ఆర్.ఓ.బి. నిర్మాణం పనులను కలక్టర్ ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా భానుగుడి వైపు మరియు శివాలయం వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, ఈ పనుల్లో భాగంగా వాటర్ పైప్ లైన్లు, ఎలక్ట్రిక్ లైన్స్ తరలింపు చేపట్టాలని కలక్టర్ సూచించారు. అప్రోచ్ రోడ్డును కాకినాడ, రాజమహేంద్రవరం రహదారిలో జడ్.పి. జంక్షన్ నుండి ఆర్.ఓ.బి. వరకు భానుగుడి జంక్షన్ వైపు ఎన్.హెచ్.-214ను కలిపే విధంగా పూర్తి చేయాలని కలక్టర్ సూచించారు. అదే విధంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఈ పనులను వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని కలక్టర్ సూచించారు.

     

    రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల ప్రగతిని ఆర్ అండ్ బి ఎస్ఇ, పి.డి. విజయ్ కుమార్ కలక్టర్ కు వివరిస్తూ ఆర్.ఓ.బి.కి ఇరువైపులా అప్రోచ్ రోడ్లు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి అయిందని, అదే విధంగా ఈ భూములలో ఉన్న కట్టడాలని కూడా చాలా వరకు తొలగించామని, శివాలయం వైపు మరో రెండు కట్టడాలను తొలగించవలసివుందని కలక్టరుకు వివరించారు . కలక్టర్ వెంట జే.సి.-2 సిహెచ్.సత్తిబాబు, ఆర్ అండ్ బి ఇఇ కె.ప్రకాష్, రావు, ఎన్.హెచ్.-216 అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్.వెంకటరమణ తదితరులు ఉన్నారు.