• జిల్లాలో అంటు వ్యాధుల నుండి కాపాడుకోవడానికి ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు. బుధవారంనాడు కాకినాడ కలక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో మలేరియా , డెంగ్యూ వ్యాధులపై అవాహన కల్పించే మొబైల్ క్లినిక్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ వ్యాధుల పట్ల అవగాహన కలగి ఉండటం మరియు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా వాటి నుండి కాపాడు కోవచ్చునని, ఈ మేరకు జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో వచ్చే రెండు నెలల పాటు మలేరియా, డెంగ్యూ పై విస్తృత అవగాహన మొబైల్ క్లినిక్స్ ద్వారా కల్పిస్తారని కలక్టర్ తెలిపారు. జిల్లాలో గత సంవత్సరాలలో ఎక్కడయితే అంటు వ్యాధులు నమోదు అయ్యాయో ఆ ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, ఆ ప్రదేశాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ మొబైల్ క్లినిక్స్ ద్వారా జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీలలో డోర్-టు-డోర్ తిరిగి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తారన్నారు. అదే విధంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కూడా వ్యాధుల పట్ల అవగాహనా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రమేష్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వ్యాధుల పట్ల అవగాహన కోసం 8 మొబైల్ క్లినిక్స్ పని చేస్తాయని, ప్రతీ వాహనంలో నలుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టర్-2 సిహెచ్.సత్తిబాబు, అదనపు డియంహెచ్ఓ టి.యస్.ఆర్.మూర్తి, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా అధికారి డా. కేశవ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.