• రక్తదానం... ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునే ప్రక్రియ, దీన్ని ఒక సామాజిక ఉద్యమంలా కొనసాగించాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ రంగరాయ వైద్యకళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఏవిధమైన నష్టం ఉండదని, ప్రతిఒక్కరూ వారు జరుపుకొనే ప్రత్యేక కార్యక్రమాల్లో రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. దీని ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారం అవుతామన్నారు. జీజీహెచ్‌ పర్యవేక్షకుడు ఎం.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నవారు మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చునన్నారు. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన యు.అనంతస్వరూప్‌, తదితరులను కలెక్టర్‌ చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో జేసీ-2 సీహెచ్‌ సత్తిబాబు, అదనపు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎం.పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.