• ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కార్తికేయమిశ్రా రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి మూడు పార్లమెంట్‌, 19 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో దూరదృశ్య సమావేశాన్ని నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బారీకేడింగ్‌, వాహన పార్కింగ్‌ నిషేధిత జోన్లు, ప్రదేశాలు తెలియజేసే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాలపై మీడియాకు సమాచారం అందించేందుకు ప్రతీ నియోజకవర్గ కేంద్రం వద్ద లైజన్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు నిర్వహించే సిబ్బందిని ఈ నెల 16న ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. అదేరోజు సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి స్థాయి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా క్లరికల్‌, కంప్యూటర్‌ సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులకు మంగళవారం కలెక్టరేట్‌లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కాకినాడ పార్లమెంట్‌ పరిధి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమలాపురం పార్లమెంట్‌ పరిధి, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రాజమహేంద్రవరం పార్లమెంట్‌, అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌.సత్తిబాబు, డీఆర్వో గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.