• ఈ ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పధకం ద్వారా
  వేతనదారులకు ఉపాధి మెరుగుపరచడానికి నిర్ణయించిన లక్ష్యాల మేర పని
  దినాలు కల్పించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు.
  జిల్లాలో అమలు జరుగుచున్న ఉపాధి హామీ పధకాన్ని వివిధ సమన్వయ శాఖల
  జిల్లా అధికారులతో మంగళవారం కాకినాడ కలక్టరేట్ లో కలక్టర్
  సమీక్షించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్ధిక
  సంవత్సరంలో రెండు కోట్ల తొమ్మిది లక్షల మేర పని దినాలు కల్పించాలని
  లక్ష్యంగా నిర్ణయించారని, ఈ లక్ష్యాలను సాధించడానికి జిల్లాలోని
  వివిధ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని అన్నారు. అదే
  విధంగా లేబర్ కాంపోనెంట్ క్రింద రూ . 418 కోట్లు, మేటీరియల్
  కాంపోనెంట్ క్రింద రూ. 270 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు చేయవలసివుందని,
  దీనికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అన్నారు.
  ప్రస్తుత సీజన్ లో ప్రతీ రోజు జిల్లాలో రెండున్నర లక్షల మంది ఉపాధి
  కూలీలు పనులకు హాజరౌతున్నారని, రుతుపవనాలు మూలంగా వచ్చే వర్షాలను
  దృష్టిలో పెట్టుకుని జూన్ నెలాఖరు నాటికి సాధించవలసిన లక్ష్యాల మేర
  పనులు చేపట్టాలని కలక్టర్ సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పధకం
  ద్వారా సీసీ రోడ్లు నిర్మాణం చాలా వరకు పూర్తయ్యిందని, ఈ పధకం
  ద్వారా గ్రావెల్ మరియు మెటల్ రోడ్లు వేయడానికి చర్యలు
  తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలో చేపట్టిన 978 సోలిడ్ వేస్ట్
  మేనేజ్ మెంట్ యూనిట్లు పూర్తి స్ధాయిలో పని చేసేలా చర్యలు
  చేపట్టాలని, అదే విధంగా పాఠశాలలకు ప్రహారీ గోడల నిర్మాణం మరియు పశు
  సంవర్ధక శాఖ సమన్వయంతో స్ధలం అందుబాటులో వున్న ప్రాంతాల్లో
  గోకులాలు నిర్మించాలని కలక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ
  పధకం సమన్వయంతో చేపట్టే పండ్ల తోటలు, ఎవెన్యూ ప్లాంటేషన్ ,
  మత్స్యకారుల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్స్ , గృహ
  నిర్మాణం పనులు, జలసిరి వంటి పనుల ప్రగతిని కలక్టర్ సమీక్షించారు.
  ఈ సమావేశంలో పాల్గొన్న డ్వామా పిడి యం.వెంకటరమణ జిల్లాలో
  అమలు జరుగుతున్న ఉపాధి పనులు వివరిస్తూ జిల్లాలో 8.36 లక్షలు జాబ్ కార్డు
  హోల్డర్లు వున్నారని, వీరిలో 4.56 లక్షలు వివిధ పనులకు హాజరౌతున్నారని
  అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రూ.207 రూపాయలు సరాసరి వేతనం
  చెల్లిస్తున్నామని కలక్టరుకు వివరించారు.
  ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ. నందనీ సలారియా, జేసి-2 సిహెచ్.సత్తిబాబు,
  హౌసింగ్ పిడి వీరేశ్వర ప్రసాద్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఇ అప్పారావు,
  పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ జేడిలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఇతర
  శాఖల అధికారులు పాల్గొన్నారు.

   

  పట్టన, గ్రామీణ స్వయం సహాయ బృందాలకు బ్యాంకు
  రుణాలు, స్త్రీ శక్తి రుణాలు జారీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని
  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి డిఆర్డిఏ, మెప్మా అధికారులను కోరారు.

  మంగళవారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి
  డిఆర్డిఏ, మెప్మా అధికారులుతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా
  అమలౌతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా గత
  సంవత్సరం స్వయం సహాయ బృందాలకు లక్ష్యాన్ని మించి బ్యాంకు రుణాలు కల్పించడం
  పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సర రుణ లక్ష్యాలు ఇంకా నిర్ణయించాల్సి
  ఉందని, ఈలోగా కాలహరణం కాకుండా గత యేడాదిలాగే మహిళా సంఘాలకు రుణాల జారీ
  ప్రక్రియను కొనసాగించాలని అధికారులను కోరారు. స్త్రీ నిధి రుణాల పంపిణీ సమీక్షలో
  కొన్ని సంఘాలు సక్రమంగా రుణాలు తిరిగి చెల్లించని కారణంగా మొత్తం మండలం లోని
  సంఘాలకు క్రొత్త రుణాలు నిలిచి పోవడాన్ని గమనించి, డిఫాల్టర్ గ్రూపులను
  మోటివేషన్ ద్వారా రుణాలు తిరిగి రాబట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
  రుణాల పంపిణీలో బ్యాంకుల స్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని వచ్చే
  వారం సమీక్షలో తెలియజేయాలని కోరారు. మొబైల్ బుక్ కీపింగ్, రిగ్యులర్ సంఘ
  సమావేశాల నిర్వహణ, ఆదాయాలనిచ్చే ఉత్పాదక కార్యక్రమాల్లో రుణాల
  సద్వినియోగం వంటి అంశాలలో మహిళా గ్రూపులను ప్రోత్సహించాలని, పారిశుద్యం,
  ఆరోగ్య పరిరక్షణ తదితర సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేట్లు
  చైతన్య పరచాలని కోరారు. జిల్లాలో వివిధ వర్గాల పేదలకు పంపిణీ చేస్తున్న
  సామాజిక భద్రతా పింఛన్లు వివరాలను తెలుసుకుని, వచ్చే నెలలో వైఎస్ఆర్ పెన్షన్
  కానుక క్రింద పింఛన్ల పంపిణీకి చేపట్టిన చర్యలను సమీక్షించారు. మెప్మా ద్వారా
  పట్టనాల్లో నిలువనీడ లేక రోడ్లు, చెట్ల క్రింద నిద్రించే నిరుపేదల కొరకు నైట్
  షెల్టర్ల ఏర్పాటు, సమర్థ నిర్వహణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
  అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న పట్టన ఆవాసాల్లోని చిన్నారులు, గర్భిణుల
  కొరకు నగర పోషణ కేంద్రాలను మెప్మా, ఐసిడిఎస్, మున్సిపల్ శాఖ సమన్వయంతో
  ఏర్పాటు చేయాలని కోరారు.
  ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్-2 సిహెచ్.సత్తిబాబు, డిఆర్డిఏ పిడి
  మధుసూధనరావు, మెప్మా పిడి ఉమామహేశ్వరరావు, ఏపిడిలు, డిపియంలు పాల్గొన్నారు.

   

  జిల్లాలో అర్హులైన కౌలు రైతులు అందరికీ రుణ అర్హత కార్డులు
  జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తహశిల్దారులు, ఆర్డిఓలను

  ఆదేశించారు. మంగళవారం
  సాయంత్రం జాయింట్ కలెక్టర్ మల్లికార్జున తహశిల్దారులు, ఆర్డిఓలతో వీడియో
  కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్ఈసి కార్డుల జారీ, పెండింగ్ మీ సేవా అర్జీల
  పరిష్కారం, ఎఫ్ ఎం బి. డిజిటలైజేషన్, వెబ్ లాండ్ డేటా సవరణలు, ఇళ్ల స్థలాల
  పంపిణీకి భూముల సేకరణ, కొనుగోలు, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై సమీక్షించి
  ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఖరీఫ్ లో
  లక్షా 30 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ చేసేందుకు చేపట్టిన
  లక్ష్యాన్ని రానున్న నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మీ సేవా
  ద్వారా అందిన లేట్ బర్త్ రిజిష్ట్రేషన్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ల జారీ,
  సర్వే, పౌర సరఫరా అంశాల క్రింద పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను త్వరితగతిన
  పరిష్కరించాలన్నారు. వెబ్ లాండ్ కరెక్షన్ లకు సంబంధించి జిల్లా స్థాయి
  పెండెన్సీని స్పెషల్ టీముల ఏర్పాటుతో రెండు రోజుల్లో క్లియర్ చేస్తామని
  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరి 26న క్రొత్తగా 25లక్షల మందికి ఇళ్ల
  స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టిందని, ఇందుకు జిల్లాలో అవసరమైన
  భూముల కొనుగోళ్లు, లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాలను చేపట్టాలని జాయింట్
  కలెక్టర్ రెవెన్యూ అధికారులను కోరారు.

  ఈ సమావేశంలో డిఎస్ఓ పి.ప్రసాదరావు,
  డియం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జయరాములు, సర్వే అండ్ లాండ్ రికార్డుల ఏడి
  నూతన్ కుమార్, కాకినాడ ఆర్డిఓ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.