• రాష్ట్రంలో వ్యవసాయ, సహకార రంగాల అభివృద్దికి, రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు.

    మంత్రిగా పదవీ బాద్యత స్వీకరణ అనంతరం తొలసారి జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబును జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి, జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్ అస్మి ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు వారితో జిల్లా అభివృద్ది అంశాలపై కొద్ది సేపు ముచ్చటించారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నాణ్యమైన వితనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, ఎరువులు, పురుగుల మందుల కొరత లేకుండా రైతులకు అందేలా చూడాలని సూచించారు. రైతులు చేపట్టే ఆయా రకాల పంటలకు నిర్థేశించిన గరిష్ట పరిమితి మేరకు పంటరుణాలు సకాలంలో వారికి బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో కౌలు రైతులు దళారులు, వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కకుండా పంటరుణాలు కల్పించి అండగా నిలవాలని, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మంచి ధర లభించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని రైతుల సంక్షేమం, ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తక్కువ పెట్టుబడి, నీటి వినియోగాలతో అధిక ఆదాయం పొందే సాగు విధానాలు చేపట్టేలా రైతులకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంటలు నష్టపోకుండా సాగుచేపట్టిన ప్రతి రైతూ పంటల భీమా రక్షణ పొందేలా చూడాలని, తుఫానులు, వరదల వల్ల నష్టాలను నివారించేందుకు పంట కాలాలను తగిన రీతిలో రిషెడ్యూల్ చేసుకునేలా రైతులకు అవగహన కల్పించాలని కోరారు. కూలీల కొరత నివారణకు, రైతులకు శ్రమ, ఖర్చు తగ్గించేందుకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను రైతులకు, రైతు సంక్షేమ సంఘాలకు దీర్ఘకాలిక రుణాలు, సబ్సిడీలపై అధిక సంఖ్యలో అందుబాటులోకి తేవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి గతంలో వ్యవసాయ శాఖ కమీషనర్ గా పనిచేసిన అనుభవాలతో జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్దికి వినూత్న ప్రణాళికలను చేపట్టాలని కోరారు. జిల్లాలో మార్క్ ఫెడ్, సీడ్స్ కార్పొరేషన్, ఆయిల్ సీడ్స్, ఆగ్రోస్ తదితర వ్యవస్థలను ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనదాయకంగా మలచాలని కోరారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని, జిల్లాలోని అన్ని వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార బ్యాంకులకు పునరుత్తేజాన్ని తెస్తామని మంత్రి తెలిపారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, జిల్లాలో విద్యా వికాస కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరచాలని కోరారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ది పధంలో పయనించేందుకు శాంతి బధ్రతలతో కూడిన సుహృద్భావ, ప్రగతి శీల వాతావరణాన్ని పెంపోందించాలని మంత్రి కన్నబాబు జిల్లా ఎస్పి ని కోరారు. మంత్రి సూచనల కనుగుణంగా తగు చర్యలు చేపడతామని కలెక్టర్ మురళీధరరెడ్డి, ఎస్పి అస్మి ఆయనకు తెలియజేశారు.

    అనంతరం పలువులు జిల్లా అధికారులు, పురప్రముఖలు, యువజన, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు మంత్రి కన్నబాబును ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. అభిమానంతో తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పధంలో నడిపిస్తాని తెలియజేశారు.