• జిల్లా కలెక్టర్‌గా డి.మురళీధర్‌రెడ్డిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన ప్రస్తుతం వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను సాధారణ పరిపాలన విభాగంలో (జీఏడీ) రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కలెక్టర్‌గా నియమితులైన మురళీధర్‌రెడ్డి గతంలో జిల్లాలో పోర్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ‘ఈనాడు’తో .. మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈనెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వ్యవసాయ శాఖ సమీక్ష జరగనుందని చెప్పారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు మురళీధర్‌రెడ్డి తెలిపారు.

  మురళీధర్‌రెడ్డి కుటుంబ నేపథ్యం: భార్య హేమ, పిల్లలు: నిఖిత్‌, రచన (ఇంజినీరింగ్‌ విద్యార్థులు), తల్లిదండ్రులు శ్యామలమ్మ- గోవిందరెడ్ఢి వ్యవసాయ కుటుంబం. తండ్రి గోవిందరెడ్డి జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.

  ఉద్యోగ బాధ్యతలు: మురళీధర్‌రెడ్డి గద్వాల ఆర్డీవోగా, భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారిగా, విశాఖపట్నం కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో కాకినాడ పోర్టు డైరెక్టరుగా.. 2014లో గుంటూరు జిల్లా జేసీగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్నారు.

  * పేరు : డి.మురళీధర్‌రెడ్డి
  * కేడర్‌ : 2006 ఐఏఎస్‌

  * విద్యార్హత : ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఇంజినీరింగ్‌

  * స్వస్థలం : కర్నూలు జిల్లా పాణ్యం మండలం బలపనూరు

  * విద్యాభ్యాసం : కర్నూలు, గుంటూరు