• తూర్పుగోదావరి జిల్లా 147వ కలెక్టర్‌గా Shri. డి.మురళీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో కలెక్టర్‌ ఛాంబరులో ఆయన దస్త్రంపై సంతకం చేసి, విధుల్లో చేరారు. ఆయనకు సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తామన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్లుగా భావించి అన్ని రంగాల్లో ముందుంచేలా కృషి చేస్తానని చెప్పారు. ఎన్నో విశిష్టతలతో విస్తీర్ణంలో పెద్దదైన ఈ జిల్లాలో కలెక్టర్‌గా సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు ముందు ఎందరో సమర్థులైన ఐఏఎస్‌ అధికారులు పనిచేశారని, ఆదర్శనీయమైన ఒరవడులను నెలకొల్పారని, అదే బాటలో జిల్లా అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో యువ ఐఏఎస్‌, అనుభవజ్ఞులైన అధికారులు పనిచేస్తున్నారని, పాలనలో వారి సహకారం తీసుకుంటానన్నారు. చైతన్యవంతమైన ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధిని సాధించేలా కార్యాచరణ చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు క్షేత్రస్థాయికి అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని కలెక్టర్‌ ముందుగానే సూచించడంతో జిల్లా అధికారులు ఆయనకు కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

  కలెక్టరేట్‌లో వివిధ విభాగాల పరిశీలన

  కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మురళీధర్‌రెడ్డి కలెక్టరేట్‌లో కలియతిరిగారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను, కీలకమైన రికార్డు గదిని పరిశీలించారు. నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాలను సందర్శించారు. కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున ఆయనకు ప్రతి విభాగం విశేషాలను వివరించారు. కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు.

  అన్నవరం వేదపండితుల ఆశీర్వచనం

  అన్నవరం: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మురళీధర్‌రెడ్డికి అన్నవరం దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం గావించారు. ఈవో ఎం.వి.సురేష్‌బాబు మర్యాద పూర్వకంగా కాకినాడ వెళ్లి శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పండితులు ఆశీర్వచనం చేయగా, స్వామివారి ప్రసాదాన్ని ఈవో అందించారు. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి కలెక్టర్‌కు వివరించారు. పీఆర్వో తులారాముడు, సూపరింటెండెంట్‌ దామెర కృష్ణారావు, గణపతి తదితరులు ఉన్నారు.

  కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

  జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మురళీధర్‌రెడ్డిని శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ విశాల్‌గున్ని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ పుష్పగుచ్ఛాలు స్వీకరించకపోవడంతో ఆయనకు ఓ మొక్కను ఎస్పీ బహూకరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన కలెక్టర్‌కు వివరించారు.