• Tags
  • ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ శుక్రవారం జిల్లాకు వచ్చారు. డీఐజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలిసారి కాకినాడలోని పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా నిర్మించిన ఈ భవనంలో వివిధ విభాగాలను పరిశీలించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి, అధికారులను అభినందించారు. ఈ విభాగం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి ఆయనకు వివరించారు. అనంతరం డీఐజీ ఖాన్‌ ఎస్పీ కార్యాలయం నుంచే రాష్ట్ర అదనపు డీజీ(శాంతిభద్రతలు) హరీష్‌కుమార్‌గుప్తా రాజధాని నుంచి నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలపై గుప్తా ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా ఎన్ని పోలీసు క్వార్టర్స్‌ నిరుపయోగంగా ఉన్నాయి? ఎన్ని శిథిలావస్థకు చేరాయి? ఎక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టాలి? పోలీసు శిక్షణ కళాశాల ఎక్కడ నిర్వహిస్తున్నారు? వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌, ఏపీఎస్పీ కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి, డీఎస్పీలు మురళీమోహన్‌, పల్లపురాజు, రవివర్మ, అప్పారావు, జిల్లా పోలీసు హౌసింగ్‌ బోర్డు డీఈ రామ్మోహన్‌ పాల్గొన్నారు.