• జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం.. మరింత ఉత్సాహంతో ముందుకు సాగడానికి క్రీడలు నిర్వహించాం.. ఇదే స్ఫూర్తితో సేవలకు పోలీసులంతా పునరంకితం కావాలని ఎస్పీ విశాల్‌గున్ని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల పాటు కాకినాడలో నిర్వహించిన జిల్లా పోలీసు గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ - 2019 ఆదివారంతో ముగిసింది. దీన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించామని, ఈ నెల 23న ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. 15 ఏళ్ల తరువాత జిల్లా పోలీసు క్రీడలు నిర్వహించామని, వీటిని ఏటా కొనసాగించడానికి కృషి చేస్తామన్నారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారని అన్నారు. పోలీసులంతా ఒక కుటుంబంగా పేర్కొన్నారు. అదనపు ఎస్పీ ఎస్‌వీ శ్రీధరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా పోలీసు క్రీడాకారుల నుంచి ఎస్పీ విశాల్‌ గున్ని గౌరవ వందనం స్వీకరించారు. పోటీల్లో గెలిపొందిన వారికి ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. బహుమతి ప్రదానం తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు నృత్యం చేసి సందడి చేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ కె.చక్రవర్తి, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, శిక్షణ ఐపీఎస్‌ తుహిన్‌ సన్హా, డీఎస్పీలు మురళీమోహన్‌, పల్లపురాజు, రవివర్మ, రామకృష్ణ, ఎస్‌వీ అప్పారావు, ఎస్పీ సతీమణి నేహ గున్ని, ఎస్పీ తల్లిదండ్రులు జయప్రకాశ్‌, సావిత్రి, సోదరుడు నితిన్‌, పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    ఓవరాల్‌ ఛాంపియన్‌గా జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు యూనిట్‌

    క్రీడల్లో కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీస్‌ సబ్‌డివిజన్‌ యూనిట్లు, జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు, హోంగార్డ్సు యూనిట్లు పాల్గొన్నాయి. ఒక్కో యూనిట్‌ నుంచి క్రీడల్లో జట్లు, అథ్లెటిక్స్‌లో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, షటిల్‌ బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, టెన్నికాయిట్‌ పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్‌ విభాగంలో 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, షాట్‌ఫుట్‌, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, 400 రిలే, 1600 రిలే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు యూనిట్‌ నిలిచింది. వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను ఆర్మ్‌డ్‌ రిజర్వు కానిస్టేబుల్‌ ఎస్‌.శ్రీనివాసరావు సాధించారు.

    ఆఖరి రోజూ అదే జోరు

    జిల్లా పోలీసులు క్రీడల ఆఖరి రోజు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. రంగరాయ వైద్య కళాశాల, జిల్లా క్రీడా మైదానం, పరేడ్‌ మైదానంలో వివిధ పోటీలు నిర్వహించారు. కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌లో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు జట్టు విజయకేతనం ఎగురవేసింది. వాలీబాల్‌ పోటీలో హోంగార్డ్సు యూనిట్‌ విజేతగా నిలిచింది. ప్రథమ స్థానాల్లో నిలిచిన జట్లనే ప్రకటించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎగ్జిక్యూటివ్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ సిబ్బంది మధ్య జరిగిన క్రికెట్‌ పోటీలో ఎగ్జిక్యూటివ్‌ జట్టు విజయం సాధించింది. అథ్లెటిక్స్‌లో పలువురు వ్యక్తిగతంగా మెడల్స్‌ సాధించారు.