• నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో శ్రద్ధ పెట్టాలని పురపాలక శాఖ సంచాలకుడు(డీఎంఏ) కె.కన్నబాబు ఆదేశించారు. కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో బుధవారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల కమిషనర్లతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజారోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషనర్లపై ఉందన్నారు. ఇందులో భాగంగా సూక్ష్మ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కమిషనర్లు చిత్తశుద్ధితో అమలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరుచేసి ఇచ్చే విధానంపై, చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో చెత్త నిర్వహణకు అనుకూలమైన యూనిట్లను నెలకొల్పాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జ్ఞానధార కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని సూచించారు. పదో తగరతి పరీక్షా ఫలితాల్లో పురపాలక, నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించారని, ఇది అందరి కృషి ఫలితమేనన్నారు. పురసేవ యాప్‌కు, కార్యాలయాలకు వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. తద్వారా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి ఉండకూడదన్నారు. ఇకపై జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతామన్నారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, విద్యాప్రమాణాలు, తదితర అంశాలపై కమిషనర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పురపాలక శాఖ అదనపు సంచాలకురాలు ఆశాజ్యోతి, సంయుక్త సంచాలకుడు పూర్ణచంద్రరావు, ప్రాంతీయ సంచాలకుడు జి.నాగరాజు, రాజమహేంద్రవరం కమిషనర్‌ సుమిత్‌కుమార్, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ సుధాకర్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, కార్పొరేషన్లు, పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు.