• జిల్లాలోని మూడు పార్లమెంట్‌, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 23న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై కాకినాడ పార్లమెంట్‌ సహాయ రిటర్నింగ్‌ అధికారి, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. పోలీసు, విద్యుత్తు, ర.భ., బీఎస్‌ఎన్‌ఎల్‌, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈనెల 22, 23 తేదీల్లో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్తు అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులకు సూచించారు. ఏ విధమైన సమస్య ఎదురైనా తక్షణ నివారణకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలు, పార్కింగ్‌ ప్రదేశాల వద్ద బారికేడింగ్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ర.భ.శాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నాటికి ఇవన్నీ పూర్తి చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు తగు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద ఒక డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు తమ సిబ్బందితో భద్రత కల్పించాలన్నారు. వాహనాలు, ప్రజల సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ప్రతి కేంద్రం వద్ద నాలుగు, అయిదు ఫ్యాక్స్‌ యంత్రాలు, ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సాంకేతిక సిబ్బందిని అన్ని వేళలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నోడల్‌ అధికారిగా ఆయన ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సమావేశంలో డీఆర్వో ఎంవీ గోవిందరాజులు, ర.భ.శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, పోలీసు నోడల్‌ అధికారి, కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు.