• Location
    Collectorate, Kakinada
  • Tags
  • చదువుల తల్లి మురిసింది.. పదోతరగతి పరీక్షల ఫలితాల్లో మరోసారి జిల్లా సత్తా చాటింది. 98.19 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన పదోతరగతి ఫలితాలతో జిల్లాలో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. 2013-14 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న జిల్లా.. తర్వాత రెండు, మూడు స్థానాలకు పరిమితమైంది. మళ్లీ 2016-17లో అగ్ర స్థానంలో నిలిచింది. గత ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న జిల్లా మళ్లీ ఈ సంవత్సరంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేసిన జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్‌.అబ్రహంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు.జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 68,324 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 67,088 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 33,294 మంది (98.20 శాతం), బాలికలు 33,794 మంది (98.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 5,456 మంది (7.99 శాతం) విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 2018లో జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 65,957 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,086 మంది 10/10 జీపీఏ సాధించారు.

    కష్టానికి ప్రతిఫలం ఈ అగ్రస్థానం

    పదోతరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షల్లో విద్యార్థులు 98.19 శాతం మేర ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఎనిమిది మంది 10కి 10 జీపీఏ సాధించారు రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా విద్యా శాఖ అధికారి, సర్వశిక్షా అభియాన్‌ పీవో, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఇలా అందరి కష్టానికి ప్రతిఫలమిది. అందరికీ అభినందనలు తెలుపుతున్నా.. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారు.

    -కార్తికేయ మిశ్రా, జిల్లా కలెక్టర్‌

    సమష్టి కృషి ఫలితమిచ్చింది

    పదో తరగతి పరీక్షల ఫలితాల్లో గత కొన్నేళ్లుగా జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం.ఈసారి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాం. నవంబరు 30 నాటికి పాఠ్యాంశాల సిలబస్‌ పూర్తి చేశాం..అనంతరం ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టాం. పిల్లలను ఎ, బి, సి, డి కేటగిరీలుగా విభజించి..ఏబీ కేటగిరీ విద్యార్థులకు ఒక ప్రణాళిక.. సీడీ కేటగిరీ విద్యార్థులకు మరో ప్రణాళిక అనుసరించాం. అప్పటి నుంచి పరీక్షల వరకు 50 వరకు పరీక్షలు నిర్వహించాం. ప్రతి సబ్జెక్టుపై 5 నుంచి 20 మార్కులకు తరచూ పరీక్షలు పెట్టి వారి స్థాయిని గుర్తుచేస్తూ లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారించాం. పదోతరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా రెండు సార్లు వారి పనితీరుపై సమీక్షించాం. దీంతో అంతా అప్రమత్తమయ్యారు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున నిర్వహించిన అదనపు తరగతులు ఫలితాలను ఇచ్చాయి. అన్ని స్థాయుల్లో విద్యార్థులపై శ్రద్ధపెట్టారు. డీవీఈవోలు, ఎంఈవోలు బాగా పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు బాగా కష్టపడ్డారు. అందుకే రాష్ట్ర స్థాయిలో ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవగలిగాం. 10/10 జీపీఏలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. జిల్లా కలెక్టర్‌ మొదటి నుంచి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అందరి సమష్టి కృషి వల్లే ఈ ఫలితాలు లభించాయి. .

    - ఎస్‌.అబ్రహం, జిల్లా విద్యాశాఖ అధికారి