• విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఆధునిక, సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలని ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.వి.ఎస్‌.ఆర్‌.దీక్షితులు పేర్కొన్నారు. కాకినాడలోని జేఎన్‌టీయూ ప్రాంగణంలో పెట్రోలియం ఇంజినీరింగ్‌ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘డౌన్‌స్ట్రీమ్‌ ప్రాసెసింగ్‌ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పెట్రోలియం రిఫైనింగ్‌’ అనే అంశంపై ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను సోమవారం ప్రారంభించారు. పీఈ, పీసీఈ సెమినార్‌ హాల్‌లో కార్యశాల కన్వీనర్, కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.లింగరాజు అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దీక్షితులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేసి అందుకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించగలిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రయోగశాలల్లో విద్యార్థులకు రోజులో 40 శాతం వరకు సమయాన్ని కేటాయించాలని, పరిశ్రమలతో అనుసంధానమయ్యేలా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సూచించారు. బెంగళూరులోని మంగుళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) మాజీ ఎండీ ఆర్‌.రాజామణి మాట్లాడుతూ పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు చాలా పెద్ద పారిశ్రామిక సముదాయాలని, వీటిలో వేర్వేరు ప్రోసెసింగ్‌ యూనిట్లు, యుటిలిటీ యూనిట్లు, నిల్వ ట్యాంకులు వంటి సహాయక సౌకర్యాలు ఉంటాయన్నారు. అధిక శాతం పెట్రో కెమికల్స్‌ వాడుతూ కాలుష్యాన్ని పెంచుతున్నారని, దీనికి బదులు ప్రత్యామ్నాయ చమురు ఉత్పత్తులను వాడడంతో పాటు విద్యుత్తు వాహనాలను వాడడం మంచిదన్నారు. అనంతరం ప్రిన్సిపల్‌ పి.సుబ్బారావు మాట్లాడుతూ అధ్యాపకులు ఆధునిక ప్రపంచీకరణ సవాళ్లను ఎదుర్కొంటూ బోధన రంగంలో తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం కోర్సుల ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేవీ రావు, డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.