• జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో మరో ఆరు రోజుల పాటు ఒంటి పూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎండల తీవ్రత వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి జూన్‌ 22 వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ నెల 12 నుంచి 15 వరకు ఒంటి పూట బడులను ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి యథాతథంగా రెండు పూటలు తరగతులు జరగాల్సి ఉంది. ఎండల తీవ్రత తగ్గకపోవటంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా మరో ఆరు రోజులు పొడిగిస్తూ చర్యలు తీసుకుంది. అన్ని పాఠశాలలు కచ్చితంగా అమలు చేయాలని డీఈవో స్పష్టం చేశారు.