You are here

Janmabhoomi - Maa Vooru Programme from Tomorrow at Kakinada

Janmabhoomi - Maa Vooru Programme from Tomorrow at Kakinada

 

 

 

 

 

జిల్లాలో బుధవారం నుంచి ‘జన్మభూమి-మాఊరు’ ఆరో విడత కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 11 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 1,069 పంచాయతీలు, 365 వార్డు/డివిజన్లలో గ్రామసభలు నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 4వ తేదీన జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో నిర్వహించే జన్మభూమి-మాఊరు సభకు ఆయన హాజరవుతారు. ఈ మేరకు ఉన్నతాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి మండలంలో గ్రామసభలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఏర్పాటు చేశారు. తహసీల్దారు, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులను ఈ బృందాల్లో నియమించారు. జన్మభూమి మోనటరింగ్‌ అధికారిగా సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జునను నియమించారు. ప్రతి గ్రామంలో ర్యాలీలు, సభలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జన్మభూమి నిర్వహించే ప్రతిరోజూ ఒక అంశాన్ని తీసుకుని ప్రజలకు వివరించనున్నారు. ఈనెల 2న రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణపై కరపత్రాలు విడుదల చేసి వివరించనున్నారు. 3న రాష్ట్ర ఆర్థిక అంశాలు, ఆర్థిక వృద్ధి, 4న సాంఘిక సాధికారత, సంక్షేమం, 5న రైతుల సంక్షేమం, ఆహార భద్రత, 6న సహజ వనరుల నిర్వహణ, నీటి భద్రత, జీవన, హరిత దృక్ఫథం, 7న మానవ వనరుల అభివృద్ధి, ఆర్యోగం, పౌష్టికాహారం, 8న మౌలిక సదుపాయాలు, 9న ఇంధన వినియోగం, 10న పరిశ్రమలు, ఉపాధి నైపుణ్యాభివృద్ధి, 11న పరిపాలన, శాంతిభద్రతలు అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. జిల్లాలో ఆరో విడత జన్మభూమి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. దీనికి అదనంగా బుధవారం రూ.75 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈసారి ప్రతి డివిజన్‌కు ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. కాకినాడ డివిజన్‌కు టీకే రామముని, రాజమహేంద్రవరం డివిజన్‌కు శాంతిప్రియ పాండే, పెద్దాపురం డివిజన్‌కు జీఎస్‌ పండాదాస్‌, రామచంద్రపురం డివిజన్‌కు వి.రాములు, రంపచోడవరానికి అనంతశంకర్‌, అమలాపురానికి నందని సలారియా, ఎటపాక డివిజన్‌కు అభిషిక్త్‌ కిషోర్‌లను నోడల్‌ అధికారులుగా నియమించారు. గ్రామసభల్లో 2019 నుంచి 2024 వరకు గ్రామ/డివిజన్‌/వార్డు స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేస్తారు. ఈనెల 6వ తేదీ ఉదయం 6.30 గంటలకు మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో 5కే రన్‌ నిర్వహించనున్నారు. చివరి రోజున క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రతిరోజూ వచ్చే అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయిలో విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థికేతర అంశాలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Share this content.