You are here

Joint Collector Review Meeting with HDS Committee at GGH Kakinada

Joint Collector Review Meeting with HDS Committee at GGH Kakinada

 

 

 

 

 

 

 

 

 

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్‌)లో సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ మల్లికార్జున ఆసుపత్రి అధికారులకు సూచించారు. ఆసుపత్రి పర్యవేక్షాధికారి ఛాంబరులో గురువారం అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. జేసీ మల్లికార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధికి సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జేసీ సమీక్షించారు. అనంతరం సభ్యులు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు రూ.30 కోట్లతో వివిధ విభాగాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకోవటం పట్ల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షణాధికారి ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.మహాలక్ష్మి, సీఎస్‌ఆర్‌ఎంవో సత్యసుశీల, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈఈ కేశవరావు పాల్గొన్నారు.

ఈ సమస్యలపై చర్చ... 
* ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని పెంచాలని సభ్యుడు డాక్టర్‌ ఎంవీ ఆనంద్‌ సూచించారు. గైనిక్‌ వార్డులో నర్సింగ్‌ సిబ్బందిని పెంపుదల చేయాలని సభ్యురాలు డాక్టర్‌ ప్రభావతి ప్రతిపాదించారు. 
* పిడియాట్రిక్‌ విభాగంలో పలు వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు పనిచేయటం లేదని సభ్యుడు బొడ్డు వెంకటరమణ సమావేశం దృష్టికి తెచ్చారు. 
* క్యాజువాలిటీకి వచ్చే వికలాంగులు, వృద్ధ రోగులకు సహకరించేలా వీల్‌ ఛైర్లు, ట్రాలీలు, సహాయ సిబ్బందిని పెంచాలని పలువురు సభ్యులు సూచించారు. 
* ఆసుపత్రిలో ఈ-కార్యాలయ నిర్వహణకు అవరమయ్యే కంప్యూటర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. 
* న్యూరాలజీ విభాగంలో టెక్నీషియన్‌, ఈఎన్‌టీ విభాగంలో ఆడియోలజిస్ట్‌లకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.9 వేల నెలసరి వేతనాన్ని సహేతుకంగా పెంపుదల చేసేందుకు నిర్ణయించారు. 
* ప్రముఖ వ్యక్తుల పర్యటనల సందర్భంగా వినియోగిస్తున్న అంబులెన్సులు పాతవి కావడంతో వాటి స్థానంలో రూ.50 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపాలని సమావేశం నిర్ణయించింది.

యూజర్‌ ఛార్జీల పెంపునకు ఆమోదం 
ఆసుపత్రి నిర్వహణ ఛార్జీల కింద నిధులను సమకూర్చుకునేందుకు కొన్ని రకాల సేవలపై వినిమయ ఛార్జీలు(యూజర్‌) పెంపునకు సొసైటీ ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీ డెత్‌ క్లెయిములకు సంబంధించి ధ్రువపత్రాల జారీకి ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.100 యూజర్‌ ఛార్జీలను రూ.300కు పెంపుదల చేయాలని, ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న కేస్‌ షీట్‌ నకళ్లకు ఇకపై రూ.100 వసూలు చేయాలని, జనన, మరణ ధ్రువపత్రాల జారీలో భాగంగా ఉచితంగా ఇచ్చే మొదట పత్రాలకు కాకుండా, అదనంగా ఇచ్చే పత్రాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.10 ఛార్జీలను రూ.50కు పెంపుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Share this content.