• జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాలోని సీఐలతో అక్కడి నుంచే దూరదృశ్య సమావేశం చేపట్టారు. తక్కువ సిబ్బంది ఉన్నా సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తిని ఓట్ల లెక్కింపువేళలోనూ కొనసాగించాలని సూచించారు. పోలింగ్‌కు ముందు, తరవాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టులో ఛార్జిషీట్‌లు దాఖలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో బైండోవర్‌ చేసిన వారిపై ఓట్ల లెక్కింపు, తరువాత కూడా నిఘా కొనసాగించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గనిర్దేశాల ప్రకారం ఓట్ల లెక్కింపు బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎన్నికల ఫలితాల వేళ గ్రామాల్లో ఘర్షణలు జరగకుండా అవసరమైనచోట ముందస్తుగా పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చింతూరు, రంపచోడవరం, డొంకరాయి, అడ్డతీగల తదితర ప్రదేశాల్లో అవుట్‌ పోస్టులు, పోలీస్‌ స్టేషన్ల భద్రతపై ఆయన తగు సూచనలు చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులపై దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి, పనితీరు పరిశీలించారు. సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్ని, అదనపు ఎస్పీ(పరిపాలన) ఎస్‌వీ శ్రీధరరావు, ఓఎస్డీ కె.చక్రవర్తి, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌ దేవ్‌సింగ్‌, శిక్షణ ఐపీఎస్‌ తుహిన్‌ సిన్హా, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీలు మురళీమోహన్‌, పల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.