• మీకోసం ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరం
  పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన చర్యలు
  చేపట్టాలని జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.
  సోమవారంనాడు కాకినాడ కలక్టరేట్ లోని వివేకానంద మీకోసం
  ప్రజావాణి హాలులో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో 267 మంది
  అర్జీ దారులు హాజరై తమ అర్జీలను, ఫిర్యాదులను కలక్టర్ కార్తికేయ
  మిశ్రా, జాయింట్ కలక్టర్ ఎ.మల్లిఖార్జున, జేసి-2 సిహెచ్.సత్తిబాబు,
  డిఆర్ఓ యం.వి.గోవిందరాజులకు అందజేశారు. ఈ సందర్భంగా కలక్టర్
  కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ అర్జీదారుల నుండి వచ్చిన అర్జీలను
  నిర్ణీత సమయంలో పరిష్కరించి వాటి వివరాలను అర్జీదారులకు
  తెలియజేయాలన్నారు. అదే విధంగా సంబంధిత శాఖల అధికారులు అర్జీలు
  పరిష్కరించిన వివరాల నివేదికలను కలక్టరేట్ కు సమర్పించాలన్నారు. అర్జీల
  పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, అర్జీదారులు ఎంతో వ్యయ ప్రయాసలకు
  ఓర్చి దూరబారాల నుండి కాకినాడ కలక్టరేట్ కు వస్తున్నారని కలక్టర్
  తెలిపారు. ఇళ్ళు, ఇంటి స్ధలాలు, రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు మంజూరు
  చేయాలని, భూ సమస్యలు, కుటుంబ తగాదాలు పరిష్కరించాలని, ఉద్యోగాలు
  కావాలని అర్జీదారులు అర్జీలు అందజేశారని, వాటన్నిటిని త్వరితగతిన
  పరిష్కరించాలని కలక్టర్ ఆదేశించారు.
  తాళ్ళరేవు మండలం పత్తిగొంది గ్రామానికి చెందిన
  ఎన్.వి.వి.కె.అన్నపూర్ణ, కొండమూరి నాగేశ్వరరావు, తదితరులు తమ పొలాలలో
  కొబ్బరి తోటలు పెంచుతూ వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని, తమ
  పొలాలను ఆనుకుని యానాం సరిహద్దులో గల ఇసుక కాలువకు గత వారం రోజుల నుండి
  11/33 కె.వి. విద్యుత్ లైన్ మరియు స్ధంబాలు తమ పొలంలో వేస్తున్నారని
  స్ధంబాలు తొలగించి న్యాయం చేయాలని కోరుతూ కలక్టర్ కు అర్జీని
  సమర్పించగా, ఎస్.ఇ.,ఎపిఇపిడిసిఎల్, కాకినాడ ఆర్.డి.ఓ.లను పరిశీలించి
  పరిష్కరించాలని ఆదేశించారు. సోమర్లకోట మండలం కొప్పవరం గ్రామానికి
  చెందిన కె. సత్యానందం ఇరిగేషన్ కాలువ నెంబరు 6 గట్టును గుత్తాల జగన్
  మేరీ ఆక్రమించి, నిర్మాణం చేస్తున్నారని , ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు,
  తహశిల్దార్ కు ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ ఇంజనీర్లు వచ్చి నిర్మాణం

  అపమని చెప్పినా, తహశిల్దార్ పట్టా ఇచ్చారని పనులు చేపడుతున్నారని
  కలక్టర్ కు ఫిర్యాదు చేయగా, సంబంధిత ప్రాంతాన్ని పర్యటించి,
  పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఆర్.డి.ఓ.ను కలక్టర్
  ఆదేశించారు. కె.గంగవరం మండలం పేకేరు తాళ్ళపాలెం గ్రామానికి చెందిన
  కె.హారిక కాకినాడ రూరల్ చీడిగలో తుఫాన్ సెంటర్ సమీపాన సర్వే నెం.
  51/9లో తమకు ఇంటి ఖాళీ స్ధలం 10 సెంట్లు ఉందని, దానిలో ఎన్.హెచ్.216 కు
  నాలుగున్నర సెంట్లు వీలినమైనందుకుగాను నష్టపరిహారం చెల్లించారని
  మిగిలిన ఐదున్నర సెంట్లు జిరాతి భూమిలో రెడ్డి లక్ష్మి ఆక్రమించి ఇంటి
  నిర్మాణం చేపడుతున్నారని, అడ్డుకుంటే తహశిల్దార్ పట్టా ఇచ్చారని
  చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని కలక్టర్ కు ఫిర్యాదు చేయగా ,
  పరిశీలించి సంబంధిత తహశిల్దార్ పై చర్యలు తీసుకోవాలని కాకినాడ
  ఆర్.డి.ఓ.ను కోరారు . సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిపాలెం గ్రామానికి
  చెందిన కట్టా సాయిశిరీషకు తన మేనత్త కొడుకుతో 2018 ఆగస్టు నెలలో
  హైదరాబాదులో వివాహమైందని, వివాహ సమయంలో 27 లక్షలు కట్నం, బంగారం,
  లాంచనాలు అందజేశామని, తన పేరున ఉన్న 1.20 సేంట్లు భూమి అమ్మి ఇవ్వమని
  శారీరికంగా, మానసికంగా బాధపెడుతున్నారని, తనపై హత్యాయత్నం
  చేస్తున్నారని, తనను రక్షించాలని కలక్టర్ కు అర్జీని సమర్పించగా,
  మహిళాభివృధ్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ డైరెక్టర్ ను,
  అమలాపురం డి.ఎస్.పి., ఆర్.డి.ఓ.లను కేసు బుక్ చేసి తగు చర్యలు చేపట్టాలని
  కలక్టర్ ఆదేశించారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పచ్చిపాల భానూరాజ్
  కిడ్నీ సమస్యవలన రెండు కాళ్ళుచచ్చు బడిపోయాయని, పింఛన్ మంజూరు
  చేయాలని జేసీకి అర్జీని సమర్పించగా, ఆరోగ్య శ్రీలో వైద్యం
  అందించాలని, అదే విధంగా పింఛన్ మంజూరుకు తగు చర్యలు చేపట్టాలని
  డి.ఆర్.డి.ఏ. పిడిని జేసి ఆదేశించారు. గోకవరం మండలం జి.కొత్తపల్లి
  గ్రామానికి చెందిన సులోజ అప్పల కొండ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ
  చదువుతున్న కొండ కుమ్మరి విద్యార్ధులకు కుల ధృవీకరణ పత్రం జారీ
  చేయాలని కోరుతూ జేసి అర్జీని సమర్పించగా , తమ పూర్వీకుల కుల ధృవీకరణ
  పత్రం సమర్పిస్తే తగు చర్యలు చేపడతామని జేసి తెలిపారు.
  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
  పత్రికా ప్రకటన కాకినాడ, జూన్ 3, 2019.

  కాకినాడలో గల ఎ.పి.స్పోర్ట్స్ అకాడమీలో నాలుగు సంవత్సరాల
  జిమ్నాస్టిక్స్ కోర్సులో శిక్షణకు ఎంపికై రెండు సంవత్సరాలు శిక్షణ
  పొందిన ఎస్.కె.యాసీన్ 2019 మే 26 నుండి 28 వరకు థానే (ముంబయి)లో జరిగిన
  9వ ట్రాంపొలైన్ జిమ్నాస్టిక్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో
  సీనియర్ విభాగంలో పాల్గొని స్వర్ణ పతకం గెలుపొందినందుకు గాను జిల్లా
  కలక్టర్ కార్తికేయమిశ్రా దుశ్శాలువాతో ఆమెను సత్కరించారు. ఈ
  సందర్భంగా జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ మిగిలిన
  రెండు సంవత్సరాలు కాకినాడ స్పోర్ట్స్ అకాడమీలో జిమ్నాస్టిక్స్
  శిక్షణ పూర్తి చేసుకుని జాతీయ అంతర్జాతీయ స్ధాయిల్లో
  జిమ్నాస్టిక్స్ క్రీడల్లో పాల్గొని, గెలుపొంది మన దేశానికి మంచి పేరు
  తీసుకురావాలని, అలాగే విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు
  అధిరోహించాలని కలక్టర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
  ఈ కార్యక్రమంలో సెట్రాజ్ సిఇఓ ఎస్.మల్లిబాబు, కోచ్ లు వి.కాసుల
  నాయుడు, ఎన్.సురేష్ తదితరులు పాల్గొన్నారు.