Meekosam Prajavani will be held at New Court Hall from Tomorrow
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వినతులు అందించటానికి అర్జీదారులు ప్రయాస పడాల్సి వస్తోంది. గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. ఇరుకైన కోర్టు మందిరంలో జిల్లాస్థాయి అధికారులు, అర్జీదారులు కిక్కిరిసిపోవాల్సి వస్తోంది. లోపల స్థలం సరిపడక కోర్టు మందిరం బయటే పడిగాపులు కావాల్సి వస్తోంది. ఇకపై ఇటువంటి కష్టాలు ప్రజావాణిలో కనిపించే అవకాశం లేదు. కలెక్టరేట్ వెనుక భాగంలో గతంలో ప్రజావాణిని నిర్వహించే ప్రదేశంలో అర్జీదారుల కోసం ప్రత్యేక శీతల మందిరాన్ని నిర్మించారు. రూ.50 లక్షల నిధులతో దీన్ని తీర్చిదిద్దారు. విశాలమైన హాలు, ఏసీ యంత్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి అధికారులంతా హాలుకు రెండు వైపులా గోడలకు సమీపంలో, మధ్యలో అర్జీదారులు వేచి ఉంటేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, జేసీ, జేసీ-2 వేదికపై అర్జీలు స్వీకరిస్తారు. అర్జీలు ఇవ్వటానికి వచ్చినవారు హాల్లోనే ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మందిరంలో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆదివారం కూడా కలెక్టరేట్ అధికారులు దగ్గరుండి పనులు చేయించారు. ప్రస్తుతం కలెక్టరేట్లో 100 కేవీఏ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ఉంది. అదనంగా మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నారు. శీతల యంత్రాల వినియోగం పెరగనున్న నేపథ్యంలో విద్యుత్తు అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Like us on Facebook
© 2016. Kakinada9.com. All Rights Reserved.