• ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వెబ్‌కౌన్సెలింగ్‌ జూన్‌ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డా.డి.జ్యోతిర్మయి తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్‌ 5 వ తేదీన ఫిజికల్‌ సైన్స్, కంఫ్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో, 6వ తేదీన హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్, కెమికల్‌ సైన్స్, హిందీ విభాగాల్లో, 7వ తేదీన మ్యాథమెటికల్‌ సైన్స్, ఇంగ్లీషు, ఎంపీఈడీ, విభాగాలకు, 8వ తేదీన లైఫ్‌సైన్స్, తెలుగు, జియాలజీ విభాగాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఉభయగోదావరి జిల్లాలో అయిదు కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా కాలేజ్‌ ఫర్‌ ఉమెన్స్, రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గల ఆదిత్య డిగ్రీ కళాశాల, భీమవరంలోని డి.ఎన్‌.ఆర్‌.కళాశాల, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని ఎమ్‌.ఎస్‌.ఎన్‌.కళాశాల, అమలాపురంలోని ఎస్‌.కె.బి.ఆర్‌.పీజీ కళాశాలల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ అయిదు కేంద్రాల్లో ఎక్కడికైనా అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఓపెన్‌లో ఉంటాయని, 13వ తేదీన సీటు కేటాయింపు జరుగుతుందన్నారు. స్పెషల్‌ కేటగిరీ కౌన్సెలింగ్‌ జూన్‌ 9, 10 తేదీల్లో నన్నయ ప్రాంగణంలో నిర్వహిస్తామని ఆమె వివరించారు.