• Tags
  • ప్రజావాణిలో వచ్చే అర్జీలకు మరింత జవాబుదారీ కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు దాఖలు చేసిన అర్జీలకు రసీదులు ఇచ్చేవారు కాదు. వాటిని తీరిగ్గా మీ-కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసేవారు. ఈ వారం నుంచి అక్కడిక్కడే అర్జీదారుడికి రసీదులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణిలో ప్రతి అర్జీకి రసీదు అందజేశారు. దీనికోసం అక్కడే సిబ్బందిని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత వ్యక్తికి రసీదు అందించారు. ఇలా అర్జీదారుల్లో నమ్మకాన్ని పెంచడానికి చర్యలు చేపట్టారు. ప్రతీ సమస్యను పరిష్కరించడానికి నిర్దేశిత గడువు నిర్ణయించారు. దీని ప్రకారం సమస్య పరిష్కరించిందీ లేనిదీ అర్జీదారుడికి సమాధానం ఇవ్వనున్నారు. పరిష్కరించకపోతే కారణాలను కూడా తెలియజేస్తారు. ఈ విధంగా ప్రజావాణి అర్జీలకు మరింత జవాబుదారీతనం కల్పించడానికి చర్యలు చేపట్టారు.

    సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు

    ప్రజావాణిలో అర్జీదారులు సమస్యలపై అందించిన ప్రతి అర్జీకి తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా అధికారులను ఆదేశించారు. వివేకానంద ప్రజావాణి మందిరంలో కలెక్టర్‌తోపాటు సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ-2 సత్తిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుమారు 200 మంది అధికారులకు అర్జీలు అందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి జరిగింది. ప్రజల సమస్యలను కలెక్టర్‌తోపాటు అధికారులు విని అక్కడున్న జిల్లాస్థాయి అధికారులతో చర్చించారు. వీటిని త్వరగా పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై అర్జీలను కలెక్టర్‌ స్వీకరించగా భూములు, రేషన్‌కార్డులు సంబంధిత సమస్యలపై వినతులను జేసీ స్వీకరించారు.

    తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

    ప్రజావాణికి హాజరైన జిల్లా అధికారులకు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా పలు సూచనలు చేశారు. జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. చలివేంద్రాలు కొనసాగించి చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. ఎండల తీవ్రత తగ్గేవరకూ వీటిని కొనసాగించాలన్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణ హాని లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ పనులు ముగిసినందున ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో కూలీలకు పనులు కల్పించాలని, ఎండల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు పనులు ముగించేలా చూడాలని ఆదేశించారు.