• జిల్లా ప్రజలు పంచిన ఆత్మీయత, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని, పాలనలో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో ఉంచుకోవద్దని బదిలీపై వెళుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరారు. కలెక్టరేట్‌లోని వివేకానంద ప్రజావాణి మందిరంలో జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను గురువారం సత్కరించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జేసీ మల్లికార్జున అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా నిరుపమానమైన సేవలు అందించారన్నారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన చొరవ మరులేమన్నారు. యువ ఐఏఎస్‌ అధికారులు నిషాంత్‌కుమార్, సాయికాంత్‌వర్మ, వినోద్‌కుమార్, అభిషిక్త్‌కిషోర్‌ మాట్లాడుతూ నిర్ణయాల్లో వేగం, వాటి అమల్లో నిబద్ధతతో కూడిన కచ్చితత్వం వంటి ఎన్నో అంశాలను ఆయన నుంచి నేర్చుకున్నామన్నారు. కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఈ జిల్లా తనకు వ్యక్తిగా, అధికారిగా ఎన్నో మంచి పాఠాలను, మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ జిల్లాలో కలెక్టర్‌గా సేవలు అందించే అవకాశం రావడం దైవకృప, దీవెన, అదృష్టం అన్నారు. సహకారం అందించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. జేసీ మల్లికార్జున ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ ఐఏఎస్‌ ప్రతిభారాణి, జేసీ-2 సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసా శామ్యూల్‌ దివాకర్, జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.