• జిల్లాలో రెండేళ్ల సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న విశాల్‌గున్ని చెప్పారు. కాకినాడలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీసు అధికారులు విశాల్‌గున్నిని బుధవారం సత్కరించారు. గౌరవ సూచికంగా పోలీసు సిబ్బంది ముందుగా పరేడ్‌ నిర్వహించారు. అనంతరం విశాల్‌గున్ని దంపతులను పోలీసు అధికారులు ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో జిల్లాలో ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయని, సార్వత్రిక ఎన్నికలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను సమర్థంగా నిర్వర్తించామన్నారు. హోంగార్డు నుంచి ఏఎస్పీ వరకూ అందించిన సహకారం మరువలేమన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ కె.చక్రవర్తి, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, ఏఆర్‌ ఏఎస్పీ వీఎస్‌ ప్రభాకరరావు, డీఎస్పీలు మురళీమోహన్‌, పల్లపురాజు, రవివర్మ, సంతోష్‌ తిలక్‌, సీహెచ్‌వీ రామారావు, ఆర్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.