• కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఏడు ప్రధాన పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నామపత్రాల ఉపసంహరణ సోమవారంతో ముగిసింది. ఈ నెల నాలుగో తేదీ నుంచి నామపత్రాలు స్వీకరించారు. వీటన్నింటిపై ముఖ్య ఎన్నికల అధికారి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు నరహరిశెట్టి రవికృష్ణ స్క్రూట్నీ నిర్వహించారు. సోమవారం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను కాకినాడ బార్‌ అసోసియేషన్‌ నోటీసు బోర్డులో పెట్టారు. ఏడు పదవులకు ఒక్కో నామినేషన్‌ రావడంతో వాటిని ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. కాకినాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొటికలపూడి సత్యశ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఎంపీఎస్‌ బాలసుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శిగా కె.తాతరాజు, కోశాధికారిగా జి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్, కల్చరల్‌ సెక్రటరీగా టి.రాధాకృష్ణ, కమిటీ సీనియర్‌ సభ్యులుగా పిడుగు పాపారావు, కేఆర్‌వీ బద్రిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కొటికలపూడి సత్యశ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంపీఎస్‌ బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో వీరిద్దరూ అవే పదవులకు ఏకగీవ్రంగా ఎన్నిక కావడం విశేషం. మిగతా పదవులకు ఈ నెల 14న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు, లైబ్రరీ సెక్రటరీకి ఇద్దరు, మహిళా ప్రతినిధి పదవికి ఇద్దరు, సీనియర్‌ మహిళా కమిటీ సభ్యులు ఒక పదవికి ముగ్గురు, జూనియన్‌ కమిటీ సభ్యులు నాలుగు పదవులకు అయిదుగురు పోటీలో ఉన్నారు.