• Location
    Bhanugudi Junction, Kakinada
  • Tags
  • ఏ క్రీడాకారుడైనా అథ్లెటిక్స్‌తోనే సాధన ప్రారంభించాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అథ్లెటిక్స్‌ వేసవి శిబిరాన్ని ఆదివారం సురేష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచడానికి శిక్షణ శిబిరాలు తోడ్పడుతున్నాయన్నారు. పిల్లలను క్రీడా మైదానాల వైపు నడపాలని తల్లిదండ్రులను కోరారు. క్రీడాకారుల సాధనకు చక్కటి పరికరాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు కె.స్పర్జన్‌రాజు మాట్లాడుతూ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4 శిక్షణ శిబిరాలు, సంఘాల ఆధ్వర్యంలో 4 శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏడేళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు శిబిరాల్లో పాల్గొనవచ్చన్నారు. రాజమహేంద్రవరంలో-2, కాకినాడలో 2 ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి టీవీఎస్‌ రంగరావు, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, తదితరులు పాల్గొన్నారు.