• పోలీసులు నిజాయతీగా, జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ విశాల్‌గున్ని సూచించారు. కాకినాడలోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఆయన మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల ప్రకారం... జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ సూచించారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం పూట సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రాముఖ్యమిచ్చి వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మహిళలు, బాలికలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలు, బాలికలపై హత్యాచార కేసులు, మహిళలపై వరకట్న కేసులపై అప్రమత్తంగా ఉండాలని, సత్వర న్యాయం చేయాలని సూచించారు. గంజాయి, సైబర్‌, గుట్కా, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ రిసెప్షన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఇక్కడకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ఇక్కడ పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. చిన్న పిల్లల మిస్సింగ్‌ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దర్యాప్తు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.

    బెల్టు షాపులుంటే సమాచారం అందించండి

    ఎక్కడైనా మద్యం గొలుసు దుకాణాలు(బెల్ట్‌షాపులు) ఉన్నా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ విశాల్‌ గున్ని జిల్లా ప్రజలను కోరారు. ఇందుకు సంబంధించి 94949 33233 వాట్సాప్‌ నంబరుకు సమాచారమివ్వాలన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాల నిరోధానికి లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం అందుబాటులో ఉందని, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెండింగ్‌ కేసులు విచారణలో జాప్యం చేయవద్దని, నిందితుల అరెస్టు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఛార్జిషీట్‌ దాఖలు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్సీ(పరిపాలన) ఎస్‌వీ శ్రీధరరావు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీలు మురళీమోహన్‌, పల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.