• జిల్లాలో ఈ నెల 23న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, అరకు పార్లమెంట్‌ పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారులు హాజరైన మెలకువలు తెలుసుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఓటింగ్, పోస్టల్‌ బ్యాలెట్, ఈవీఎంలు, వీవీ పాట్స్‌లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సిన విధానాలను మాస్టర్‌ ట్రైనీలు వివరించారు. ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలపై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రశ్నావళిని అధికారులకు తెలియజేసి, వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో వివరించారు. సెట్రాజ్‌ సీఈవో ఎస్‌.మల్లిబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ నెల 17న విజయవాడలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేది ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ హాళ్లలో మెస్‌ ఏర్పాటు, బారీకేండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లకు పాస్‌లు జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త్‌ కిషోర్, డీఆర్వో గోవిందరాజులు పాల్గొన్నారు.