• Tags
  • కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్‌)లో చెవిటి, మూగ చిన్నారులకు కాక్లియర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ శస్త్ర చికిత్సలు చేసేందుకు అనువుగా రూ.28.50 లక్షల వ్యయంతో అత్యాధునిక పరికరాలు సమకూరుస్తున్నట్లు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా వెల్లడించారు. కలెక్టరేట్‌ కోర్టు హాలులో గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెవిటి, మూగ చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసే సదుపాయం త్వరలోనే జీజీహెచ్‌కు సమకూరనుందన్నారు. పీఎం, సీఎం తదితర ప్రముఖుల పర్యటనలో వినియోగిస్తున్న రెండు అంబులెన్స్‌లు మరమ్మతులకు గురికావడంతో వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు తక్కువ ఉన్నందున ఆ ప్రతిపాదనను సభ్యులు తిరస్కరించారు. ఈ ఏడాది సమకూరే సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి ఆస్పత్రికి ఒక అంబులెన్స్‌ను కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఆస్పత్రిలో అటెండెంట్ల కొరత తీవ్రంగా ఉందని సమావేశంలో ప్రస్తావించారు. అనాథ రోగులు స్వస్థత పొందినప్పటికీ తీసుకెళ్లేవారు లేక వారు అలాగే ఆస్పత్రిలో ఉండిపోతున్నారని సభ్యులు పేర్కొన్నారు. దాంతో కొత్తగా వచ్చే రోగులకు ఆస్పత్రిలో వసతుల కొరత ఎదురవుతోందన్నారు. అనాథ రోగులకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఆస్పత్రిలోని రేడియోలజీ విభాగంలో మూడు ఏసీలను కొనుగోలు చేసేందుకు కమిటీ ఆమోదించింది. జీఓటీ విభాగానికి ఆరు క్రాస్‌ ట్రాలీలు, పాడైన వెంటిలేటర్ల స్థానంలో ఏడింటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఆస్పత్రికి మంజూరైన ఏడు డ్రైవర్‌ పోస్టులకు గాను ఇద్దరే ఉన్నందున జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోగల మిగుల డ్రైవర్లను జీజీహెచ్‌కు డిప్యుటేషన్‌పై నియమించేందుకు కలెక్టర్‌ అంగీకరించారు. ఆస్పత్రిలో నిర్మించిన ఆర్‌ఎంవో క్వార్టర్లలో రోగులకు అందుబాటులో ఉండేలా అధికారి బస చేసేలా చర్యలు తీసుకోవాలని సభ్యుడు బొడ్డు వెంకటరమణ కోరారు.

    ఆస్పత్రి అభివృద్ధి పనుల పరిశీలన

    జీజీహెచ్‌లో రూ.20కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సాయంత్రం కలెక్టర్‌ కార్తికేయమిశ్రా పరిశీలించారు. కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఆస్పత్రి ఆభివృద్ధి కమిటీ సమావేశం పూర్తికాగానే ఆయన సభ్యులతో కలిసి జీజీహెచ్‌ను సందర్శించారు. వివిధ విభాగాలలో పూర్తియిన ఫ్లోరింగు, వాల్‌ టైల్స్, అగ్నిమాక పరికరాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆస్పత్రికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నందున రోగులకు మెరుగైన వైద్య సేవలు ఆందించేందుకు వైద్యులు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. ఆస్పత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులతో కార్పొరేట్‌ స్థాయి హంగులు సమకూరాయని సభ్యులు చాగంటి కోటేశ్వరరావు, బాదం మాధవరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాతా, శిశు విభాగంలో బాలింతలు, గర్భిణులతో కలెక్టర్‌ మాట్లాడారు. వైద్య పరిస్థితులపై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న భోజన పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు, సభ్యులు డాక్టర్‌ ఆనంద్, డాక్టర్‌ ప్రభావతి, బొడ్డు వెంకటరమణ, ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి, ఈఈ కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.