• ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని జగన్నాథపురం సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని, చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో పలు కొత్త కార్యక్రమాలను అమలు చేయనుందని వివరించారు. మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు సెంట్రలైజ్డ్‌ మెస్‌ను ఏర్పాటు చేయనుందన్నారు. ప్రతి శనివారం నో స్కూల్‌ బ్యాగ్‌ డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుందన్నారు. డీఈవో ఎస్‌.అబ్రహం మాట్లాడుతూ రాజన్న బడిబాట కార్యక్రమం ఈనెల 15 వరకూ జరుగుతుందన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 26 వేల మంది పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం బాలలకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ-2 సత్తిబాబు, ఎస్‌ఎస్‌ఏ పీవో బి.విజయభాస్కర్‌, ఉప విద్యాశాఖాధికారి డి.సుభద్ర, అర్బన్‌ డీఐ వాణీకుమారి, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.