• Tags
  • టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికేట్‌ (టీటీసీ) శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తాము నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో ఎస్‌.అబ్రహం సూచించారు. స్థానిక పీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 42 రోజుల పాటు జరిగిన టీటీసీ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోర్సు డైరెక్టర్‌ ఎల్‌.గణేష్‌బాబు అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీటీసీ శిక్షణ భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కుట్టు శిక్షణ, అల్లికలు, డ్రాయింగ్‌ తదితర రంగాల్లో మెలకువలు నేర్చుకున్న అభ్యర్థులు వాటిని స్వయం ఉపాధికి అవకాశాలుగా మలుచుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం కూడా ఎస్‌ఎస్‌ఏ ద్వారా పాఠశాలల్లో అల్లికలు, డ్రాయింగ్‌ తదితర పోస్టులను భర్తీ చేస్తుందని తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ పీవో విజయభాస్కర్‌ మాట్లాడుతూ నెల రోజులకు పైగా కష్టపడి నేర్చుకున్న శిక్షణను భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి సుభద్ర, అర్బన్‌ డీఐ వాణీకుమారి, తదితరులు పాల్గొన్నారు.