• జిల్లాలో రానున్న రెండురోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 గంటల వరకూ నమోదయ్యే అవకాశముందని ప్రజలు వడదెబ్బ, ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అత్యవసర ప్రకటన జారీ చేశారు. ఇస్రో, యురోపియన్‌ వాతావరణ పరిశోధన సంస్థలు తెలిపిన సూచనల ప్రకారం శని, ఆదివారాల్లో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎవరూ ఆరుబయట ఎండలో సంచరించవద్దని సూచించారు. తప్పనిసరైతే ఎండ తీవ్రత ఎక్కువయ్యే లోపే పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరాలని కోరారు. నలుపు రంగులో మందంగా ఉండే దుస్తులు వాడొద్దని తెలిపారు. గొడుగు, టోపీ, తలపాగా వంటివి ధరించాలని సూచించారు. మద్యం తాగవద్దని, తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవాలని, మాంసాహారాన్ని తగ్గించాలని సూచించారు. శుభ్రమైన నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలని సూచించారు. వీరికి మజ్జిగ, గ్లూకోజ్‌ ద్రావణం, ఓఆర్‌ఎస్‌ తాగించాలని సూచించారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించవద్దని, దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కోరారు.

    ఉదయం 11 గంటల వరకే అంగన్వాడీ కేంద్రాలు

    అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు ఉదయం 11 గంటల లోపే ముగించాలని, పని ప్రదేశంలో తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని, షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆరు లక్షల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరఫరా చేశామని చెప్పారు. పంచాయతీల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీటికి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ జిల్లాలో వడదెబ్బ మరణాలు మూడు సంభవించారని కలెక్టర్‌ తెలిపారు. ఎక్కడైనా వడదెబ్బ మరణం సంభవిస్తే తహసీల్దారు, ఎస్‌ఐ, వైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ పరిశీలిస్తుందన్నారు. పరీక్ష అనంతరం త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందజేస్తారని తెలిపారు. దీనికి వయోపరిమితి ఉండదని పేర్కొన్నారు.