• Tags
 • పారిశ్రామిక ప్రగతికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఔత్సాహికులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2015- 2020 ద్వారా రాయితీలు అందిస్తోంది. దీంతో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలూ మెరుగుపడుతున్నాయి. తాజాగా జిల్లాలో సూక్ష్మ- చిన్న- మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో దేవీపట్నం, చింతూరు, మండపేట, కడియం, పెద్దాపురం మండలాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న చిన్న, పెద్ద పరిశ్రమల్లో 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు రూ.8,656 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. పలు సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు దక్కించుకున్న ఖాళీ భూములు వినియోగంలోకి వస్తే మరింత మందికి ఉపాధి దక్కుతుందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. గత నాలుగన్నరేళ్లలో జిల్లాలో రూ.1528.20 కోట్లతో ఈ తరహా పరిశ్రమలు 34 ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 19,605 మంది ఉపాధి దక్కించుకున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో 350 యూనిట్ల ఏర్పాటు ద్వారా 2,583 మందికి ఉపాధి కల్పించారు. ఈ పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

  సూక్ష్మంలో మోక్షం..

  జిల్లాలో సూక్ష్మ- చిన్న- మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహా పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కింద జనరల్‌ కేటగిరీకైతే రూ.20 లక్షల వరకు 15 శాతం రాయితీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.75 లక్షల వరకు 35 శాతం రాయితీ కల్పిస్తున్నారు. మహిళల్లో జనరల్‌కు రూ.30 లక్షల వరకు రూ.25 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.75 లక్షల వరకు 50 శాతం రాయితీ అందిస్తున్నారు. పారిశ్రామికవాడలో భూమి కొన్న ధరపై రాయితీలు 25 నుంచి 50 శాతం వరకు.. విద్యుత్తు వినియోగంపై యూనిట్‌కు రూపాయి నుంచి రూ.1.50 వరకు అయిదేళ్ల వరకు రాయితీ అందిస్తారు. భూమి కొనుగోలుపై స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రాయితీ 100 శాతం వరకు ఇస్తున్నారు. అమ్మకపు పన్నుపై రాయితీని శత శాతం వర్తింపజేస్తున్నారు. భూమి వినియోగ మార్పిడిపై రూ.10 లక్షల వరకు 25 శాతం రాయితీ ఇస్తున్నారు.ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ఈ రాయితీలు వర్తింపజేస్తుండడం..పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తుండడంతో ఔత్సాహికుల్లో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుపై ఆసక్తి పెరుగుతోంది.

  అడుగులు పడుతున్నాయ్‌..

  జిల్లాలోని మన్యంలో దేవీపట్నం, చింతూరులలో పారిశ్రామికవాడల ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ అనువైన 200 ఎకరాల వరకు భూములు గుర్తించారు. అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతారు. గిరిజనులకు ఉపాధి కల్పన దిశగా ఇప్పటికే 165 తేనె ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటుచేయించి పలువురికి ఉపాధి కల్పించిన పరిశ్రమల శాఖ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా గిరిజనులకు స్థానికంగానే ఉపాధి చూపే దిశగా చర్యలు చేపడుతోంది. మండపేట మండలం వేములపల్లిలో 30.45 ఎకరాలు, కడియం మండలం జేగురుపాడులో 38.67 ఎకరాలు, పెద్దాపురంలోని ఆర్‌బీపట్నంలో 14.12 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా పార్కుల లేఅవుట్ల అనుమతి కోసం గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా)కు పంపారు. ప్లాను అనుమతి కోసం గుడాకు ఒక్కో పార్కుకు రూ.25 లక్షల చొప్పున ఏపీఐఐసీ చెల్లించాల్సి ఉంది.

  ఔత్సాహికులకు పూర్తి సహకారం

  జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2015- 2020 ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు భారీగా అందిస్తోంది. మౌలిక సదుపాయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిబంధనలతో కూడిన 50 శాతం రాయితీని రూ.కోటి వరకు అందిస్తోంది. మొదటి తరం పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు పరికరాల పెట్టుబడులపైనా 10 నుంచి 25 శాతం వరకు రాయితీ ఇస్తోంది. ఈ అవకాశాలను ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి. సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. దేవీపట్నం, చింతూరు, మండపేట, కడియం, పెద్దాపురం మండలాల్లో ఈ పార్కులు ఏర్పాటుకానున్నాయి.

  - ఎ.వి.పటేల్‌, సంయుక్త సంచాలకుడు, జిల్లా పరిశ్రమల శాఖ