• పర్యావరణాన్ని పరిరక్షిస్తాం.. వాయు కాలుష్యాన్ని తరిమేస్తాం.. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని సృష్టిస్తాం... అంటూ విద్యార్థులు, పారిశ్రామిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతిన బూనారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి జిల్లా శాఖ, ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కాకినాడలో గ్రీన్‌ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద పార్కు వద్ద ర్యాలీని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. ర్యాలీ జేఎన్‌టీయూకే వరకూ కొనసాగింది. భానుగుడి కూడలి వద్ద భారీ మానవహారం నిర్వహించారు. జేఎన్‌టీయూకేలోని అలుమ్ని ఆడిటోరియంలో ‘వాయు కాలుష్యాన్ని తరిమేద్దాం’ అంశంపై నిర్వహించిన సదస్సులో డీఎఫ్‌వో ఆనంతశంకర్‌, గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ కేవీ శ్రీనివాస్‌ ముఖ్యఅతిథుఫఫలుగా హాజరై ప్రసంగించారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీరు ఎ.రామారావునాయుడు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూకే అధికారులు మురళీకృష్ణ, పి.సుబ్బారావు, వీవీ సుబ్బారావు, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు ఎస్‌.సురేఖ, కాలుష్య నియంత్రణ మండలి సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.