• వైద్య రంగంలో నర్సు వృత్తి ఎంతో పవిత్రమైనదని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు అన్నారు. జీజీహెచ్‌ మాతా, శిశు విభాగం వద్ద ప్రపంచ నర్సింగ్‌డే సందర్భంగా ఆదివారం ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం, కాకినాడ యూనిట్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. నైటింగేల్‌ విగ్రహానికి డాక్టర్‌ రాఘవేంద్రరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. కేకు కోసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్యం కోసం వచ్చే రోగులకు సొంత కుటుంబ సభ్యుల్లా నర్సులు సేవలు అందిస్తారన్నారు. తగ్గిపోతుందని కల్పించే భరోసాతో రోగికి సగం జబ్బు నయం అవుతుందన్నారు. నర్సులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే మంచి పేరు వస్తుందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు కొమ్మిరెడ్డి అనురాధ మాట్లాడుతూ రోగులకు సేవలు అందించే అదృష్టం నర్సులకే దక్కుతుందన్నారు. ఈ వృత్తిని ఎంతో పవిత్రంగా భావించాలని, నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కోశాధికారి ఏసీహెచ్‌ ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు రేష్మా సుల్తానా పాల్గొన్నారు.