• జిల్లాలో మడ అడవులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రపంచ వారసత్వ సంపదగా మడ అడవులను తీర్చిదిద్దేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తాళ్లరేవు మండలంలోని కోరంగి, ఐ.పోలవరం మండలంలోని భైరవపాలెంలో 23,570 హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. దీనికి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా అటవీ శాఖ రాజమహేంద్రవరం సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శాంతిప్రియపాండే, కార్యదర్శిగా డీఎఫ్‌వో (వైల్డ్‌లైఫ్‌)ను, సభ్యులుగా మరికొంత మందిని ప్రభుత్వం నియమించింది. వీరు మడ అడవుల గొప్పతనం, విస్తీర్ణం, వృక్ష, పక్షి సంపద వంటి వివరాలను తయారు చేసి రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ విషయాన్ని శాంతిప్రియపాండే తెలిపారు. సహజ సిద్ధంగా ఏర్పడిన మడ అడవులు తుపాను, సునామీ వంటివి సంభవించినప్పుడు తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కవచంలా ఉంటూ కాపాడతాయి. 34 రకాల మడజాతులు, 27 రకాల పక్షిజాతులు ఇక్కడ ఉన్నాయి. దీనికితోడు మడ అడవులు ఉండటంతో ఈ ప్రాంతంలో మత్స్య సంపద అధికంగా ఉంటోంది.