• Tags
  • సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా అయిదు రోజులే గడువుంది. సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కాకినాడలోని అయిదు కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పంపిన ప్రతిపాదనకు ఎన్నికల కమిషన్‌ ఆమోదం లభించడంతో ఆ ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మరో రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 20 శాతం రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 648 మంది లెక్కింపు పర్యవేక్షకులు, 730 మంది కౌంటింగ్‌ ..మిగతా 7లోసహాయకులు, 709 మంది సూక్ష్మ పరిశీలకులు, 2,100 మంది సహాయక సిబ్బంది, 911 మంది పోలీసు సిబ్బందితో కలిపి 5,908 మంది ఉద్యోగుల సేవలను వినియోగిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రాంగణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు నిలపాలని ఆంక్షలు విధించారు.జిల్లాలో ఏప్రిల్‌ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేతలెవరు..? పరాజితులెవరు..? అన్నది తేల్చే రోజు దగ్గరపడుతోంది. జిల్లాలో మూడు లోక్‌సభ, 19 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో 4,581 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉత్కంఠకు తెరపడనుండడంతో ఓట్ల లెక్కింపు రోజు కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

     

    ఎన్ని టేబుళ్లు..ఎన్ని రౌండ్లు..?

    జిల్లాలో 19 శాసనసభ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు రోజున ఎన్నేసి టేబుళ్లు వేయాలన్న అంశంపై అధికారులు స్పష్టతకు వచ్చారు. 23వ తేదీ ఉదయం 7.30 గంటలకు పరిశీలకులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు స్ట్రారగ్‌ రూములు తెరుస్తారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత ఈవీఎంలు..చివర్లో వీవీ ప్యాట్లు లెక్కిస్తారు. అసెంబ్లీకి 10 నుంచి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు.19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 252 టేబుళ్లు వేయాలని, జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లోక్‌సభ స్థానాలతో పాటు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న రంపచోడవరంతో కలిపి 244 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లోక్‌సభ పరిధిలోని పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు పదేసి చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల పోస్టల్‌ బ్యాలెట్లు 21,727.. లోక్‌సభ స్థానాలవి 19,418 అధికారులకు చేరాయి.

     

    చివర్లో రంపచోడవరం ఫలితం..

    కాకినాడలోని జేఎన్‌టీయూ, రంగరాయ వైద్యకళాశాల, జిల్లా క్రీడా ప్రాంగణంలోని ఇండోర్‌ స్టేడియం, ఐడియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అధికారుల ఏర్పాట్ల ఆధారంగా చూస్తే.. పెద్దాపురం, కాకినాడ నగరం, రాజమహేంద్రవరం నగరం, మండపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 16 రౌండ్లలోనే ముగుస్తుంది. దీంతో ఈ ఫలితాలు ముందుగా వెలువడే అవకాశం ఉంది. అత్యధికంగా రాజానగరం 22 రౌండ్లలో.. జగ్గంపేట 25 రౌండ్లలో, రంపచోడవరం నియోజకవర్గం లెక్కింపు 29 రౌండ్లలో పూర్తకానుంది. దీంతో ఈ ఫలితాలు చివర్లో వచ్చే అవకాశం ఉంది. అంతిమంగా రంపచోడవరం ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.