• జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత, ఆదాయాల పెంపు లక్ష్యంగా వార్షిక, నెలవారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరికోతలు 95 శాతం పూర్తయ్యాయని, ఈ నేపథ్యంలో వేసవి పంటలకు రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. రబీలో ఎకరాకు 46 బస్తాల సరాసరి దిగుబడి సాధించామన్నారు. ధాన్యం సేకరణ మరింత ముమ్మరం చేయాలన్నారు. వేసవిలో అపరాలు, పచ్చిరొట్ట ఎరువు పంటల సాగుకు విత్తనాలు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గత ఏడాది జిల్లాలో 20,576 హెక్టార్ల విస్తీర్ణంలో 52,191 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించారని, ఈ ఏడాది మరింత ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన పంటల్లో బిందు, తుంపర సేద్య వసతులను ప్రోత్సహించి, లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ ఏడాది కనీసం 3వేల హెక్టార్లలో ఈ వసతులు విస్తరణకు కృషి చేయాలన్నారు. మత్స్యకారులకు సంబంధించిన పథకాలకు నిర్దేశించిన యూనిట్లు నూరుశాతం పంపిణీ చేయాలని, 2019-20 ఆర్థిక సంవత్సరానికి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ-2 సీహెచ్‌.సత్తిబాబు, వ్యవసాయశాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

    అల్లూరి త్యాగనిరతి ఆదర్శం కావాలి

    మాతృభూమి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగనిరతి నేటి తరానికి ఆదర్శం కావాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పిలుపు నిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల అలంకరించి, పుష్పాంజలితో ఘన నివాళి అర్పించారు.