• జిల్లాలో ప్రధాన నగరాల అభివృద్ధి దిశగా సుదీర్ఘ ప్రణాళికలకు అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు కీలకమైన రాజమహేంద్రవరం నగరాలకు సంబంధించిన బృహత్తర ప్రణాళికలు (మాస్టర్‌ప్లాన్లు) ఇప్పటికే ఆమోదం పొందిన విషయం తెలిసిందే. వీటి కాలపరిమితి మరింత పెంచి సాంకేతికతను జోడించేందుకు గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా) చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తోంది. 2017లోనే ప్రభుత్వ ఆమోదం పొందిన రాజమహేంద్రవరం నగర బృహత్తర ప్రణాళికకు 2031 వరకు కాలపరిమితి ఉంది. తాజాగా ఈ ఏడాది మార్చి 24న ప్రభుత్వ ఆమోదం పొందిన కాకినాడ ఆకర్షణీయ నగర బృహత్తర ప్రణాళికకు 2035 వరకు కాల పరిమితిని నిర్దేశించిన విషయం తెలిసిందే. గుడా పరిధిలో కీలకమైన ఈ రెండు నగరాల ప్రణాళికలకు సాంకేతిక సొబగులు అద్ది గుడా మాస్టర్‌ప్లానుకు అనుగుణంగా 2040 వరకు ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు మనుగడలో ఉండేలా చర్యలు చేపట్టారు. ఆయా నగరాల్లో తాజాగా రూపొందించిన ప్రణాళికలపై అభ్యంతాలకు నెలరోజుల పాటు గుడా అవకాశం కల్పించింది.జిల్లాలో 2,730 చదరపు కిలోమీటర్లలో గుడా విస్తరించి ఉంది. ఈ పరిధిలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, రామచంద్రపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. 33 మండలాల పరిధిలోని 354 గ్రామాల్లో విస్తరించిన సంస్థ 2040 వరకు వర్తించేలా అభివృద్ధి కోసం నిర్దేశించిన బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గుడా మాస్టర్‌ప్లాన్‌ ఈఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల నాటికి సిద్ధం కానున్నట్లు సమాచారం. గుడా పరిధిలో కీలకమైన రెండు నగరాలకు మాస్టర్‌ప్లాన్లకు ఇప్పటికే ఆమోదం లభించడంతో వీటిలోనూ సాంకేతికతను జోడించి కాలపరిమితి పెంచే దిశగా చర్యలు చేపట్టారు.

   

  కొత్త చట్టానికి అనుగుణంగా అడుగులు..

  బృహత్తర ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపోలిటన్‌ రీజియన్స్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ చట్టం (ఏపీఎంఆర్‌యూడీఏ)- 2016కు అనుగుణంగా మారుస్తున్నారు. పాత ప్లానునే కొత్త చట్టం పరిధిలోకి తెస్తూ సాంకేతికతను జోడిస్తున్నారు. గతంలో నగరాల పరిధిలోని భూములు, భవనాలు, రహదారులు ఇతరాలను ఆటోకేడ్‌ విధానంలో నమోదు చేసేవారు. ఇందులో ఆయా సర్వే నంబర్లు మినహా మరే వివరాలు ఉండేవికావు. తాజాగా కాకినాడ, రాజమహేంద్రవరం నగర బృహత్తర ప్రణాళికలను జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లోకి మార్చారు. ఇందులో క్లిక్‌ చేసే సర్వే నంబర్‌తో సహా అందులోని ప్రతి అంశం.. దాని వివరాలు, జియోట్యాగింగ్‌ తరహాలో మొత్తం సమాచారం తెలుసుకునే వీలుంది. ఈ కొత్త చట్టం ప్రకారం 2040 వరకు వర్తించేలా జోనల్‌ డెవలప్‌మెంటు ప్లాన్ల కిందకు మార్చారు. దీనిపై అభ్యంతరాలకు ఈనెల అయిదో తేదీ నుంచి నెల రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నారు. భూసంబంధిత హోదా మారినా.. అభ్యంతరాలేమైనా ఉన్నా..అనుమతి పొందిన లేఅవుట్లపై అభ్యంతరాలు ఎదురైనా..గుడా మాస్టర్‌ప్లానులో నిర్దేశించిన రోడ్లు ప్రైవేటు భూముల మీదుగా వెళ్లినా.. సంబంధింత గుడా యంత్రాంగం దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకువచ్చే అవకాశం కల్పించారు.

   

  అభ్యంతరాలకు నెలరోజులు అవకాశం

  కాకినాడ, రాజమహేంద్రవరం మాస్టర్‌ప్లాన్లను ఏపీఎంఆర్‌యూడీఏ చట్టానికి అనుగుణంగా జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లోకి మార్చాం. గుడా బృహత్తర ప్రణాళికతోపాటు ఈ రెండు నగరాల ప్రణాళికలూ 2040 వరకు మనుగడలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. తాజా జాబితాలు అన్ని పంచాయతీలు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఈనెల 5 నుంచి అందుబాటులో ఉంచుతాం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో గుడా దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకురావచ్ఛు త్వరలో గుడా మాస్టర్‌ప్లాన్‌ ఆమోదానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో గుడా పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటాం.

  - ఆర్‌.అమరేంద్రకుమార్‌, వీసీ, గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా)